- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Switzerland: ఐడియా అదిరింది కదా.. రైలు పట్టాలపై సౌర శక్తి సాఫరీ!
ప్రపంచ దేశాలలో శాస్త్ర సాంకేతికంగా అగ్రగామిగా ఉన్న స్విట్జర్లాండ్ (Switzerland) మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ దేశాలలో శాస్త్ర సాంకేతికంగా అగ్రగామిగా ఉన్న స్విట్జర్లాండ్ (Switzerland) మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టిన ఈ దేశం.. పర్యావరణహిత పరిష్కారాల కోసం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రైల్వే రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతోంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ముందున్న స్విట్జర్లాండ్.. తాజాగా, రైలు పట్టాలపై సోలార్ ప్యానళ్లను (Solar Panels) అమర్చే వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించింది. రైల్వే ట్రాక్‌ల (Railway tracks) మధ్య ఖాళీగా ఉండే ప్రదేశాన్ని వినియోగిస్తూ, ట్రైన్లకు నేరుగా విద్యుత్‌ను సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ రూపొందించారు. ఇక ఈ టెక్నాలజీని 'సన్వే (Sun-Ways)' అనే స్విట్జర్లాండ్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది.
రైళ్లు ప్రయాణించే రైల్వే ట్రాకులు ఎంత పొడవుగా ఉంటాయో తెలిసిందే. రైళ్ల ప్రయాణానికి తప్ప వీటితో మరేలాంటి ఉపయోగం ఉండదు. నిరూపయోగంగా ఉన్న వీటి మధ్య భాగంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా అదనపు భూమి అవసరం లేకుండా విద్యుత్తు శక్తి ఉత్పత్తి చేయవచ్చు. అయితే, ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. 2020లో సన్వే కంపెనీ వ్యవస్థాపకుడు జోసెఫ్ స్కుడెరి ఓసారి ట్రైన్ కోసం ఎదురుచూస్తుండగా ట్రాక్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని దేనికైనా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా? అనుకున్నారు.
అనంతరం తన స్టార్టప్ కంపెనీ ద్వారా ఈ ఆలోచనను స్టిట్జర్లాండ్ ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టారు. రైల్వే ట్రాక్ మధ్యలో సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ తయారు చేస్తామని చెప్పారు. అయితే, సౌర ఫలకాల కారణంగా రైలు భద్రత, నిర్వహణకు ఇబ్బందులు కలుగుతాయని ముందుగా ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది. దీంతో ప్రత్యేకమైన సోలార్ ప్యానెల్స్ రైళ్లకు ఎలాంటి అంతరాయం కలిగించవని సంస్థ నిరూపించింది. ఆ తర్వాత ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ (FOT) రైల్వే లైన్ల మధ్య సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దీంతో పశ్చిమ స్విట్జర్లాండ్‌లోని బుట్టెస్ గ్రామ పరిధిలోని 100 మీటర్ల రైల్వే ట్రాక్‌పై 48 సౌర ఫలకాలను అమర్చి మూడేళ్ల పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇందుకోసం సుమారు రూ. 6.04 కోట్లు ఖర్చు చేసింది.
ఇక సన్ వేస్ కంపెనీ కథనం ప్రకారం సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఫోటోవోల్టాయిక్ కరెంట్‌ను మూడు విధాలుగా ఉపయోగించవచ్చు. రైల్వే మౌలిక సదుపాయాలకు (స్విచ్‌లు, సిగ్నల్‌లు, స్టేషన్లు) ఉపయోగించుకోవచ్చు. ఇదే కరెంట్‌ను సమీపంలోని స్థానిక GRD (డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఆపరేటర్)కు అందించే అవకాశం ఉంటుంది. అటు లోకో మోటివ్‌లకు కూడా విద్యుత్ సరఫరా చేయవచ్చని సన్ వేస్ కంపెనీ వెల్లడించింది.






