రోబోల యుగం వచ్చేసింది.. ఇక మనుషుల పరిస్థితి ఏంటి?

by Yella Dhawani Reddy |

రోజు రోజుకు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

రోబోల యుగం వచ్చేసింది.. ఇక మనుషుల పరిస్థితి ఏంటి?
X

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence) అందుబాటులోకి వచ్చాక శాస్త్ర సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. విద్య, వైద్య సహా ప్రతి రంగంలో ఏఐ హవా నడుస్తోంది. దీంతో ఊహించనదానికంటే వేగంగా హ్యూమనాయిడ్ రోబోలు (Robots) ప్రతి పనిని టేకోవర్ చేసేసుకుంటున్నాయి. ఇది చూస్తుంటే భవిష్యత్తులో మనుషులు ఉద్యోగాలు సంపాదించుకోవటం మరింత కష్టంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అనేక దేశాల్లో మనుషులు చేసే పనులను రోబోలు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నాయి.

* చైనా, జపాన్ సహా పలు దేశాల్లో ఇప్పటికే అనేక పనులకు రోబోలను వినియోగిస్తున్నారు. నిర్మాణ రంగంలో మనుషులు కంటే 10 రెట్లు వేగంగా రోబోలు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాయి. గోడలు వేసే పని, ఇటుకలు పేర్చటం, ఫినిషింగ్ వంటి పనులను అత్యధిక వేగంతో చేస్తూ నిర్మాణ పరిశ్రమలో విప్లవం తీసుకొస్తున్నాయి.

* చైనాలోని హాంగ్‌జౌలో గ్యాస్ స్టేషన్‌లో ఒక రోబో రాత్రి వేళలలో సేవలు అందిస్తుంది. కస్టమర్లకు ఇంధనం నింపడం, చెల్లింపులు స్వీకరించడం లాంటి పనులు చేస్తుంది. అలాగే, జపాన్‌లో రోబోలను క్రీడలు, సైనిక శిక్షణ, భద్రత వంటి రంగాల్లో వినియోగిస్తున్నారు.

* అంతేకాదు, రోడ్డు సైన్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా రోబోలను వాడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, సూచిక బోర్డులను వేయడం వంటి పనుల్లో ఈ రోబోలు వేగంగా, ఖచ్చితంగా పనిచేస్తున్నాయి.

* విద్యుత్తు సమస్యలు తలెత్తినప్పుడు హై-వోల్టేజ్ కేబుళ్ల మరమ్మతులు చేస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పొతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ పనులు చేసేందుకు రోబోటు వచ్చేశాయి. ప్రమాదకరమైన పనులను మనుషులకి బదులుగా రోబోలు చేస్తున్నాయి. మానవ ప్రాణాలకు ప్రమాదం లేకుండా విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తున్నాయి.

* ఇప్పటికే అనేక రెస్టారెంట్లలో వంట చేసే రోబోలు కూడా వచ్చేశాయి. అతి చిన్న విషయాలకు కూడా మనుషులకు పని లేకుండా ప్లేయింగ్ కార్డులు పంచే రోబోలు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేశాయి. అంతేకాదు, పలు ఫ్యాక్టరీలో సర్వీసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ వంటి పనుల్లో మానవులను భర్తీ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇక భవిష్యత్తులో అసలు మనుషులకు ఏం పని ఉండేట్టు లేదు అనిపిస్తోంది.

Next Story