చెక్క ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్న జపాన్... ఏ చెట్టు చెక్కో తెలుసా..?

by Disha Web Desk 20 |
చెక్క ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్న జపాన్... ఏ చెట్టు చెక్కో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో ప్రపంచంలోని అనేక దేశాలు అంతరిక్షంలోకి ఎన్నో సాటిలైట్లను పంపిస్తూ ప్రయోగాలను చేస్తుంది. ఈ క్రమంలోనే ఆధునిక సాంకేతికతకు ప్రసిద్ధి చెందిన జపాన్ చెక్కతో చేసిన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. శాస్త్రవేత్తలు దీనికి లిగ్నోసెట్ అని పేరు పెట్టారు. ఇది మాగ్నోలియా చెట్టు చెక్కతో తయారు చేశారు. కొన్ని నివేదిక ప్రకారం, జపాన్ అంతరిక్ష సంస్థ JAXA మార్చిలో నాసా సహాయంతో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ప్రస్తుతం అమెరికా రాకెట్‌ నుంచి దీన్ని ప్రయోగించే ప్లాన్‌ పూర్తయింది. కానీ ఒక చెక్క ఉపగ్రహాన్ని తయారు చేయవలసిన అవసరం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది?

జపాన్‌కు చెందిన ఈ ప్రత్యేకమైన ఉపగ్రహాన్ని క్యోటో విశ్వవిద్యాలయం, లాగింగ్ కంపెనీ సుమిటోమో ఫారెస్ట్రీ పరిశోధకులు రూపొందించారు. దీనికి సంబంధించిన పనులు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయి. చెక్క ఉపగ్రహాల తయారీకి ప్రధాన కారణం పర్యావరణ పరిరక్షణ.

ప్రస్తుత ఉపగ్రహాల సమస్యలు ఏమిటి ?

ప్రస్తుతం, ఉపగ్రహాలు తమ మిషన్‌లను పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చినప్పుడు, వాతావరణంలో ఘర్షణ కారణంగా అవి కాలిపోతాయి. జపనీస్ వ్యోమగామి, క్యోటో విశ్వవిద్యాలయానికి చెందిన ఏరోస్పేస్ ఇంజనీర్ టకావో డోయి భూ వాతావరణంలో కాలిపోయినప్పుడు ఉపగ్రహాలు చిన్న అల్యూమినియం కణాలను ఏర్పరుస్తాయని హెచ్చరించారు. ఈ కణాలు చాలా సంవత్సరాలు వాతావరణంలో ఉంటాయి. ఇది భూమి పర్యావరణం పై చెడు ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

భవిష్యత్తులో ఏటా 2,000 అంతరిక్ష నౌకలను ప్రయోగించవచ్చని అంచనా. ఇవి పెద్ద మొత్తంలో అల్యూమినియంను ఎగువ వాతావరణంలో నిక్షిప్తం చేసే అవకాశం ఉంది. ఇది పెద్ద సమస్యను సృష్టించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఓజోన్ పొర కూడా బలహీనపడుతుందని కొన్ని శాస్త్రీయ పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఓజోన్ పొర సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుండి భూమిని రక్షిస్తుంది.

చెక్క ఉపగ్రహం ప్రయోజనాలు ఏమిటి ?

బయోడిగ్రేడబుల్ వస్తువులు ప్రకృతిలో సహజంగా నాశనం అవుతాయని, పర్యావరణాన్ని పాడుచేయవని చెబుతున్నారు. క్యోటోలోని పరిశోధకులు చాలా కాలంగా చెక్క ఉపగ్రహాల పై ఈ ఆలోచనను కొనసాగిస్తున్నారు. ఈ రకమైన అంతరిక్ష నౌకలో సరైన కలపను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం వివిధ రకాల చెక్కలను పరీక్షించారు. భూమి చుట్టూ తిరిగేటప్పుడు మారుతున్న ఉష్ణోగ్రతలలో కూడా ప్రయోగ ఒత్తిడిని తట్టుకోగల చెక్కను ఎంచుకోవాలి.

లిగ్నోశాట్ ఉపగ్రహం అంతరిక్ష విధ్వంసాన్ని తట్టుకోగలదా ?

వివిధ రకాల చెక్కలను మొదట ప్రయోగశాలలో పరీక్షించారు. కలపను అనేక వాతావరణాల్లో ప్రయోగించారు. అలాగే బరువులో పెద్దగా మార్పు లేదని పరీక్షలో తేలిందని చెబుతున్నారు. భూమిపై పరీక్షించిన తర్వాత, వాటిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపించారు. ఆ నమూనాలను దాదాపు 300 రోజుల పాటు ISS వెలుపల కాస్మిక్ కిరణాలకు బహిర్గతం చేశారు. అంతరిక్షంలో ఆక్సిజన్ ఉండదని, దాని వల్ల అక్కడ కలపను కాల్చలేమని ప్రాజెక్ట్ హెడ్ కోజీ మురాటా వివరించారు. ఇతర నమూనాలలో, మాగ్నోలియా చెట్టు కలప బలమైనదని నిరూపన అయ్యిందని వెల్లడించారు. ఈ చెక్కతో ఉపగ్రహాన్ని తయారు చేస్తున్నారు.

జపాన్ న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం NASA, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) మార్చిలో ISSకి ఉపగ్రహాన్ని పంపగలవు. అంతరిక్షంలో చెక్క నిర్మాణాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో పరీక్షించడం కూడా ఉపగ్రహం మిషన్లలో ఒకటి. గార్డియన్ నివేదిక ప్రకారం 6 నెలల పాటు అంతరిక్షంలో పని చేసిన తర్వాత, ఉపగ్రహం ఎగువ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. లిగ్నోశాట్ విజయవంతమైతే, అది (మాగ్నోలియా కలప) భవిష్యత్ అంతరిక్ష యాత్రలలో కొత్త విప్లవాన్ని తీసుకువస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Next Story

Most Viewed