విరాళాల కోసమే బీజేపీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

by Dishanational2 |
విరాళాల కోసమే బీజేపీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. వ్యాక్సిన్ తయారీ దారుల నుంచి రాజకీయ విరాళాలు సేకరించడం కోసమే బీజేపీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణాంతక మందులను అనుమతించడం అంటే ఎవరినైనా హత్య చేయడానికి కుట్రపన్నడమేనని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సుమారు 80 కోట్ల మంది భారతీయులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారని గుర్తు చేశారు. ‘కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారు నుంచి బీజేపీ కమిషన్ తీసుకుంది. అందుకే ప్రజలకు బలవంతంగా అందించింది’ అని పేర్కొన్నారు. బీజేపీని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని తెలిపారు.

కాగా, తాను తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ రక్తం గడ్డ కట్టడానికి కారణమవుతుందని బ్రిటన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో భారతదేశ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఎందుకంటే బ్రిటన్ అభివృద్ధి చేసిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసి కోవిషీల్డ్ పేరుతో విక్రయించింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ కూడా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఇదేనా మోడీ హామీ అని ప్రశ్నించారు. మోడీ దేశ ప్రజలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు.

Next Story