- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.8700 కోట్లు ఆఫర్ చేసిన మీరాను వదలని ఉద్యోగులు.. ఇంతకీ ఎవరీమె?
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) యుగం నడుస్తోంది. ఈ రంగం, ఆ రంగం అని లేకుండా.. ఆరోగ్య రంగం నుంచి వినోదం వరకు, విద్యా వ్యవస్థ నుంచి వ్యాపార నిర్వహణ వరకు అన్ని రంగాల్లో ఏఐని విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈ సాంకేతిక విప్లవాన్ని ముందుగా గుర్తించిన టెక్ దిగ్గజాలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెట్టడమే కాక, ఈ రంగంలో ఉన్న ప్రతిభావంతుల కోసం కోట్లాది రూపాయల ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా ఉద్యోగులు కూడా తమకు మంచి అవకాశం వస్తే, మరింత ఎక్కువ ప్యాకేజీ కోసం కంపెనీలు మారడాన్ని సహజంగా చూస్తుంటాం. కానీ ఓ ఏఐ స్టార్టప్ మాత్రం ఈ సాంప్రదాయానికి మినహాయింపైంది. తమ సంస్థ విడిచిపెట్టి ఒక్కరూ కూడా బయటకి వెళ్లలేదు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఓపెన్‌ఏఐ (Open AI) మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) మీరా మురాటీ (Meera Murati) 2025 ఫిబ్రవరిలో 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' అనే కొత్త ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ స్టార్టప్ ద్వారా మురాటీ ఏఐ టెక్నాలజీని ప్రజల అవసరాలకు అనుగుణంగా సైన్స్, ప్రోగ్రామింగ్ వంటి ఇతర రంగాలలో సైతం మరింత సమర్థవంతంగా మార్చటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మెటా, మిస్ట్రాల్, ఓపెన్‌ఏఐ వంటి కంపెనీల్లో పనిచేసిన 30 మంది పేరు పొందిన ఏఐ నిపుణులను ఆమె నియమించుకున్నారు. అయితే, ఈ స్టార్టప్‌లోని నైపుణ్యం మెటా (Meta) దృష్టిని ఆకర్షించింది. దీంతో వెంటనే అక్కడ పనిచేసే ఏఐ నిపుణులను తనవైపు లాగేసుకునేందుకు ప్రయత్నించిందని, ఈ ఏఐ నిపుణులకు 200 మిలియన్ల డాలర్ల నుంచి 500 మిలియన్ల డాలర్ల వరకు మెటా ఆఫర్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.
ఇక ఓ ఉద్యోగికైతే ఏకంగా 1 బిలియన్ డాలర్లు (రూ.8,755 కోట్లు) ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు వార్తలు వైరల్‌గా మారాయి. అయితే ఏ ఒక్క ఉద్యోగి కూడా ఆ ఆఫర్లను స్వీకరించలేదు. 'థింకింగ్ మెషిన్స్ ల్యాబ్‌ను పెట్టి సంవత్సరం కూడా కాలేదు. దాని నుంచి ఏ ఒక్క ఉత్పత్తి కూడా ఇంతవరకు మార్కెట్‌లోకి విడుదలవలేదు. కానీ ఆ సిబ్బంది మాత్రం మురాటీపై విశ్వాసం ప్రదర్శించారు' అని ఆ కథనాలు వెల్లడించాయి. ఇప్పుడు ఆ సంస్థ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇంతకీ ఎవరీ మీరా మురాటీ?
మీరా మురాటీ (Mira Murati).. అల్బేనియాలోని వ్లోర్ అనే పట్టణంలో 1988లో జన్మించారు. చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి కనబరిచేవారు. పాఠశాల విద్య పూర్తి అయ్యాక.. ఆమె పైచదువుల కోసం తన 16వ ఏట కెనడాలోని వాంకోవర్ ఐస్‌ల్యాండ్‌కు వెళ్లిపోయారు. పియర్సన్ కాలేజీ పీడబ్ల్యూసీలో 2007లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2012లో డార్ట్‌మౌత్ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకుంది. అనంతరం ఇంటర్న్‌గా కెరీర్ ఆరంభించి.. జోడియాక్ ఏరోస్సేస్‌లో 2013 వరకు పనిచేసింది. ఆ తర్వాత టెస్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన ఆమె.. ఈ వ్యవధిలో ఈ సంస్థ అభివృద్ధి చేసిన మోడల్ ఎక్స్ ఈ-కారు మోడల్‌కు సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా అద్భుతమైన సేవలందించారు.
అనంతరం లీప్ మోషన్ అనే వర్చువల్ రియాల్టీ సంస్థలో రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించిన మీరా.. నిజ జీవితంలోని పలు సంఘటనలకు కృత్రిమ మేధను జోడిస్తూ కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ మక్కువతోనే 2018లో ఓపెన్ ఏఐ సంస్థలో అప్లైడ్ ఏఐ అండ్ పార్టర్న్‌షిప్స్ వైస్ ప్రెసిడెంట్ చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ 2022లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా బాధ్యతలందుకున్నారు. ఏఐ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ రూపకల్పనలో ఆమె కూడా కీలక పాత్ర వహించారు. ఇక సొంతంగా కంపెనీ స్థాపించాలనేది మీరా మురాటీ చిరకాల స్వప్నాన్ని సారాకం చేసుకునేందుకు 2024 సెప్టెంబరులో ఓపెన్ ఏఐకి గుడ్‌బై చెప్పి, సొంతంగా థింకింగ్ మెషిన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు.






