ఆ రాష్ట్ర ప్రభుత్వ వినూత్న ప్రయోగం.. కరడుగట్టిన ఖైదీలపై ఏఐ నిఘా

by Yella Dhawani Reddy |

ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రాజ్యమేలుతుందనటంలో అతిశయోక్తి లేదు.

ఆ రాష్ట్ర ప్రభుత్వ వినూత్న ప్రయోగం.. కరడుగట్టిన ఖైదీలపై ఏఐ నిఘా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రాజ్యమేలుతుందనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. పొద్దన లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు, ప్రతి రంగంలో ఏఐని వినియోగిస్తున్నారు. నిత్య జీవితంలోని చిన్న చిన్న సమస్యల దగ్గర నుంచి వాణిజ్య, వ్యాపార రంగాల్లో ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యల వరకు అన్నింటికి పరిష్కారాలను చూపిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ (West Bengal) ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జైళ్లలో నేరగాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడానికి ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయనుంది.

బెంగాల్ జైళ్లలో ఉండే కరడుగట్టిన నేరగాళ్లు జైళ్ల నుంచి బయట నేరాలకు ప్రణాళికలు రూపొందిస్తూ, మాఫియా గ్యాంగులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు ఇటీవల పోలీసు అధికారులు గుర్తించారు. గంజాయి అక్రమ రవాణా, బెదిరింపులు, హత్యలు వంటి నేరాలకు ప్లాన్‌ చేస్తుండడంతో జైలు కేంద్రాలు నేరాలకు నిలయాలుగా మారాయన్నారు. ఈ నేపథ్యంలోనే చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించి, అడ్డుకునేందుకు వీలుగా ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖైదీల కమ్యూనికేషన్‌, ప్రవర్తనలను ట్రాక్ చేయడం ద్వారా వారు చేయబోయే నేరాలకు ముందుగానే చర్యలు తీసుకోవచ్చన్నారు. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా జైళ్లల్లో ఇప్పటికే అత్యాధునిక కెమెరాలు ఉన్నప్పటికీ ఖైదీలు తమ దృష్టినుంచి తప్పించుకుంటున్నారని పోలీసులు పేర్కొన్నారు.

ఇక ఇందులో భాగంగా ప్రతి ఖైదీ బయోమెట్రిక్ వివరాలను ఏఐతో అనుసంధానిస్తారు. ఇవి సాధారణ కెమెరాల్లా రికార్డు అవడమే కాక జైలు లోపల అనుమానాస్పద కదలికలు, తగాదాలు, విధ్వంసం, తప్పించుకునే ప్రయత్నాలు వంటివాటిని గుర్తించి వెంటనే జైలు గార్డులను అప్రమత్తం చేస్తాయి. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా భోజన సమయాల్లో, హాజరు తీసుకునే సమయంలో గైర్హాజరైన వారిని, పారిపోవడానికి ప్రయత్నించిన వారిని ట్రాక్‌ చేసి అధికారులకు రియల్-టైమ్ హెచ్చరికలను అందిస్తాయి. ముఖ్యంగా కరడుగట్టిన నేరగాళ్లు ఏఐ ప్రత్యేక నిఘాలో ఉంటారు. అంతేకాకుండా ఏఐ ద్వారా జైళ్లలో సెల్‌ఫోన్లు, పదునైన ఆయుధాలు, మాదకద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులను గుర్తించవచ్చు. ఖైదీల వ్యవహారాలను సాంకేతికంగా విశ్లేషించడం వల్ల జైలు భద్రత మెరుగవడంతో పాటు, ఖైదీల మానసిక స్థాయిని సైతం అంచనా వేసి అవసరమైన మానసిక సహాయం అందించేందుకు దోహదపడుతుంది.

Next Story