- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐ వాడకపోతే ప్రమోషన్లు 'కట్'.. ఉద్యోగులకు యాక్సెంచర్ సీరియస్ వార్నింగ్!
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ యాక్సెంచర్ (Accenture) తన ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ యాక్సెంచర్ (Accenture) తన ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై కంపెనీలో పదోన్నతులు (Promotions) కావాలంటే కేవలం పనితీరు బాగుంటే సరిపోదు.. విధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను వాడాల్సిందేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్ స్థాయి అధికారులకు కంపెనీ పంపిన అంతర్గత ఈమెయిల్‌లో ఈ మేరకు కఠిన నిబంధనలను పొందుపరిచినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఫైనాన్షియల్ టైమ్స్' వెల్లడించింది.
లీడర్‌షిప్ రోల్స్‌కు 'ఏఐ' తప్పనిసరి
భవిష్యత్తులో లీడర్‌షిప్ హోదాలకు ఎదగాలనుకునే వారు తప్పనిసరిగా ఏఐ సాధనాలను తమ రోజువారీ పనిలో భాగం చేసుకోవాలని యాక్సెంచర్ సూచించింది. ఏఐ వాడకాన్ని కంపెనీ నిశితంగా గమనిస్తుందని, పదోన్నతుల నిర్ణయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. ఉద్యోగులు ఏఐ టూల్స్‌ను ఎంతవరకు వాడుతున్నారో తెలుసుకునేందుకు యాక్సెంచర్ ప్రత్యేకంగా ట్రాకింగ్ కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. 'ఏఐ రిఫైనరీ' (AI Refinery) వంటి టూల్స్‌కు ఉద్యోగులు వారానికి ఎన్నిసార్లు లాగిన్ అవుతున్నారు? వాటిని ఎంత సమయం ఉపయోగిస్తున్నారు? అనే డేటాను సేకరిస్తున్నట్లు సమాచారం.
మారకపోతే 'గేట్ పాస్' తప్పదు!
గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ సీఈఓ జూలీ స్వీట్ పెట్టుబడిదారులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోని లేదా నేర్చుకోవడానికి ఆసక్తి చూపని వారు కంపెనీ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని (Exit) పరోక్షంగా హెచ్చరించారు. ఏఐ శిక్షణ కోసం యాక్సెంచర్ ఏటా దాదాపు 1 బిలియన్ డాలర్లను (సుమారు రూ.8,300 కోట్లు) ఖర్చు చేస్తోంది. తన 7.8 లక్షల మంది ఉద్యోగులలో ఇప్పటికే 5.5 లక్షల మందికి జనరేటివ్ ఏఐపై శిక్షణ పూర్తి చేసింది. కంపెనీ తన ఉద్యోగులను ఇకపై 'రీఇన్వెంటర్లు' (Reinventors) అని పిలవాలని నిర్ణయించింది. అంటే నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమను తాము మార్చుకునే వారని అర్థం. సాధారణంగా సీనియర్ ఉద్యోగులు కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి కొంత విముఖత చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే లీడర్‌షిప్ స్థాయి అధికారులపై యాక్సెంచర్ ఈ తరహా ఒత్తిడి తీసుకువస్తోందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.






