ఈ సారి కఠిన బయోబబుల్.. బీసీసీఐ వ్యూహం

by  |
ఈ సారి కఠిన బయోబబుల్.. బీసీసీఐ వ్యూహం
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ కోసం ఏర్పాటు చేసిన బయోబబుల్స్ బ్రీచ్ అవడంతో ఏకంగా లీగ్‌ను అర్దాంతరంగా వాయిదా పడింది. కఠినమైన బయోబబుల్స్ ఏర్పాటు చేశామని చెప్పిన బీసీసీఐ.. తీరా డబ్బు ఆదా అవుతుందని సొంతగా ప్రయోగం చేసి విఫలమైంది. బయటి ప్రపంచంతో సంబంధం లేని వ్యక్తులకు కరోనా రావడంతో బీసీసీఐ ఎంత తప్పు చేసిందో తెలుసుకున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమ్ ఇండియా కోసం రోడ్ మ్యాప్ సిద్దం చేసింది. ఇంగ్లాండ్‌లో హోటల్ గదులకు పరిమితం కాకుండా ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుకూలంగా టూర్ షెడ్యూల్ రూపొందించింది. ఇందుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా అనుమతి తెలిపినట్లు సమాచారం. పర్యటన కోసం బీసీసీఐ ఎంపిక చేసిన 24 మంది జట్టు సభ్యులతో పాటు హెడ్ కోచ్, సహాయక కోచ్‌లు, ఫిజియోలు, అనలిస్ట్‌లు అందరూ మే 25న బీసీసీఐ ఏర్పాటు చేయనున్న బయోబబుల్‌లోనికి వెళ్లనున్నారు. ముంబైలో ఏర్పాటు చేసే ఈ బబుల్‌లోకి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే అందరూ చేరి.. 8 రోజుల పాటు ఉంటారు. ఈ మేరకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డుకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఈ బయోబబుల్‌లో నిత్యం కోవిడ్ టెస్టులు నిర్వహిస్తామని.. ఒకరితో ఒకరు కలుసుకునే వీలుండదని బీసీసీఐ చెబుతున్నది.

ఇంగ్లాండ్‌లో ఏలా…?

బ్రిటన్ ప్రభుత్వం ప్రస్తుతం ఇండియాను రెడ్ లిస్టులో పెట్టింది. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోటల్స్‌లో 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. అయితే ఆటగాళ్లు ఏకాంతంగా అన్ని రోజుల పాటు ఉంటే మానసికంగా కుంగిపోతారని భావించే ఇండియాలో బయోబబుల్ ఏర్పాటు చేస్తున్నారు. బబుల్ నుంచి ఇంగ్లాండ్‌కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. కాబట్టి వీరికి కఠినమైన ఏకాంత క్వారంటైన్ కాకుండా 10 రోజుల పాటు నిబంధనలు సడిలిస్తూ క్వారంటైన్ ఏర్పాటు చేయడానికి ఈసీబీ ఒప్పుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జూన్ 2న ఇంగ్లాండ్ చేరుకునే టీమ్ ఇండియా క్వారంటైన్‌లో 10 రోజుల పాటు ఉంటుంది. ఆ సమయంలో క్రికెటర్లు సాధన చేయడానికి అనుమతి ఇస్తారు. ప్రతీ రోజు సాయంత్రం కొన్ని గంటల పాటు టీమ్ ఇండియా నెట్స్‌లో సాధన చేస్తుంది. అయితే వాళ్లు కేవలం ఈసీబీ ఏర్పాటు చేసే బబుల్‌కు మాత్రమే పరిమితం కావల్సి ఉంటుంది.

కుటుంబాలతో ప్రయాణం..?

మే 25న బయోబబుల్‌లోకి వెళ్లే టీమ్ ఇండియా బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచేసుకోవల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లో 5వ టెస్టు సెప్టెంబర్ 14న ముగుస్తుంది. అంటే దాదాపు 4 నెలల పాటు టీమ్ ఇండియా క్రికెటర్లు బయోబబుల్‌లో గడుపుతారు. అందుకే క్రికెటర్లు వారి కుటుంబాలను వెంట తీసుకెళ్లడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంగ్లాండ్ పర్యటనకు మధ్య ఒక నెల గ్యాప్ ఉంది. ఆ సమయంలో క్రికెటర్లు ఇండియాకు వచ్చే వీలుండదు. కాబట్టి కుటుంబాలను వెంట తీసుకొని వెళితే ఆటగాళ్లు ఆ నెల రోజులు కాస్త సరదాగా సమయం గడిపే అవకాశం ఉంటుందని బీసీసీఐ చెబుతున్నది. ఇంగ్లాండ్‌లో స్థానిక ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి క్రికెటర్లు ఈ టూర్‌లో కొంత సమయం సరదాగా తిరగడానికి కూడా అనుమతి ఉంటుందని తెలుస్తున్నది. అయితే ఈ నాలుగు నెలల భారత జట్టు, వారి వెంట ఉండే కుటుంబ సభ్యులు తప్పకుండా ప్రతి నిత్యం కరోనా టెస్టులు చేయించుకోవల్సి ఉంటుంది. బయోబబుల్ నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని చెబుతున్నది. మరోసారి ఐపీఎల్ లాగా విఫలమవకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నది.

Next Story

Most Viewed