విశ్వనగరం ఉత్త ముచ్చటే.. అప్పుల కుప్పగా ‘జీహెచ్ఎంసీ’..

by  |
prasuna
X

దిశ, తెలంగాణ బ్యూరో : పారాహుషార్ సీఎం కేసీఆర్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2015 ముందు 800 ఎనిమిది వందల కోట్లతో జీహెచ్ఎంసీ లాభాల బాటలో ఉందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల ఆరు వందల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు.ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జీహెచ్ఎంసీ నిర్వీర్యం అవుతుందని ఆరోపించారు.

విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు చెప్పే కేటీఆర్ సమీక్షలు నిర్వహించి నిధులను సేకరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. హైదరాబాద్‌లో వివిధ జాతుల వారు ఉంటారని, వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీహెచ్ఎంసీ ప్రతీరోజు కోటి రూపాయల వడ్డీ కట్టాల్సిన దుస్థితి నెలకొందని, దానికి పూర్తి బాధ్యత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వహించాలని డిమాండ్ చేశారు.

ప్రతి ఏటా భవనాల నుంచి రూ.1,225 కోట్లు, కేంద్రం నుంచి రెండు వందల కోట్లు రావాల్సి ఉందని వాటిని వసూలు చేయడంలో జీహెచ్ఎంసీ, ఇటు మంత్రి కేటీఆర్ వైఫల్యం చెందారని తనదైన శైలిలో మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని వరద ముంపు ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు చేపడతామని ప్రకటనలు చేసి కూడా ఏళ్లు గడుస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తెలుగు మహిళా జనరల్ సెక్రెటరీ సూర్యదేవర లత రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed