మున్సిపల్ ఎన్నికలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

by  |
politics
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈనెల 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ తన ఉనికిని చాటుకుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని టీడీపీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఈనెల నాలుగు నుంచి చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.

మార్చి 8 సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఈ 5 రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 4న కర్నూలు జిల్లాలో, 5న చిత్తూరు జిల్లాలో, 6న విశాఖ జిల్లాలో, 7న విజయవాడలో, 8న గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ మ్యానిఫెస్టోను సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పోలింగ్‌ నిర్వహించేందుకు ఎస్‌ఈసీ ప్రకటన విడుదల చేసింది.

మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవుతుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8 సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. మార్చి 10న పోలింగ్‌..14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.



Next Story