రాష్ట్ర బంద్‌కు టీడీపీ పిలుపు.. వామపక్షాల మద్దతు

by  |
Chandrababu
X

దిశ, అమరావతి : రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల నివాసాలపై వైసీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ పాటించాలని పార్టీ కార్యకర్తలు, నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం, పోలీసుల తీరుపై నిరసన తెలపాలని ఆదేశించారు. ఈ బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని చంద్రబాబు కోరారు. ప్రజలు ఎవరికి వారే తమ దుకాణాలు మూసివేయాలని కోరారు.

రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు తమతో చేయి కలపాలని కోరారు. వైసీపీ దాడులపై ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రాకపోతే భవిష్యత్‌లో మీ పిల్లల భవిష్యత్ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీ బంద్‌కు వామపక్ష పార్టీలు సైతం తమ మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గంజాయి స్మగ్లింగ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం ఉదయం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యాలయాలు నేతల ఇళ్లను ముట్టించారు. ముఖ్యంగా విజయవాడలోని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఇంటి ఆవరణలోని కారు, బైక్ ధ్వంసం చేశారు. అక్కడితో శాంతించని నేతలు ఇంట్లోని విలువైన ఫర్నీచర్‌ను సైతం ధ్వంసం చేశారు. మరోవైపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. తొలుత రాళ్లదాడికి పాల్పడ్డారు. అనంతరం కర్రలు, రాడ్లతో టీడీపీ కేంద్ర కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. అలాగే బాలకృష్ణ క్యాంప్ కార్యాలయం ముట్టడికి వైసీపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.


Next Story

Most Viewed