ఎక్కడికక్కడ నిరసనలు.. అరెస్ట్‌లు.. ఉత్తరాంధ్రలో ఉద్రిక్తంగా టీడీపీ బంద్

by  |
ఎక్కడికక్కడ నిరసనలు.. అరెస్ట్‌లు.. ఉత్తరాంధ్రలో ఉద్రిక్తంగా టీడీపీ బంద్
X

దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీ కేంద్ర కార్యాలయం మీద నిన్న జరిగిన దాడికి నిరసనగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. చంద్రబాబు పిలుపు మేరకు ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని ఆర్టీసీ బస్టాండ్ల వద్ద టీడీపీ నాయకులు నిరసనలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. దీంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా నిరసన తెలిపిన టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు. మరి కొంతమందిని నిరసనకు వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేశారు. ఈ అరెస్టులు చేసే క్రమంలో కొన్నిచోట్ల పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న ఎంపీ రామ్మోహన్ నాయుడును అరెస్ట్ చేశారు పోలీసులు.

మీడియాతో మాట్లాడుతుండగా అడ్డుకొని అరెస్ట్ చేశారు. మీడియాతో మాట్లాడుతుండగా అరెస్ట్ చేయడం పట్ల రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఒక ఎంపీగా మీడియాతో మాట్లాడే హక్కు, స్వేచ్ఛ లేదని పోలీసులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావును నిరసనకు వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా.. విజయనగరం జిల్లా సాలూరులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ ఉపాధ్యక్షులు ఆర్.పి.బంజ్ తమ కార్యకర్తలుతో కలిసి సాలూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఎన్. హెచ్ 26ని నిర్బంధించారు. దీంతో 10 కి.మీ.మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో సాలూరు పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల చర్యలకు నిరసనగా నడి రోడ్డు మీద టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి పడుకొని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఈ నిరసనను భగ్నం చేశారు. మరోవైపు విశాఖలో నిరసన చేపట్టేందుకు సిద్ధమైన తెలుగు ఏపీ టి.ఎన్. ఎస్. ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ను, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ లను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఓవరాల్ గా టీడీపీ నాయకుల అరెస్టులతో ఉత్తరాంధ్ర మారుమోగిపోయింది.



Next Story