వాళ్లందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. స్విగ్గీ సంచలన నిర్ణయం

by  |
swiggy
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ తరఫున పని చేస్తూ కస్టమర్లకు నిరంతరాయంగా ఫుడ్ డెలివరీ చేస్తున్నవారందరికీ కరోనావ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని ఆ సంస్థ తెలిపింది. సుమారు 2 లక్షల మంది డెలివరీ పార్ట్‌న‌ర్స్‌ (డెలివరీ బాయ్స్, గర్ల్స్‌ను స్విగ్గీలో ఇలాగే పిలుస్తారు) కు టీకా అందించనున్నామని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ అందించబోతున్న నేపథ్యంలో స్విగ్గీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ఇదే విషయమై స్విగ్గీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) వివేక్ సుందర్ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా తమ సంస్థలో డెలివరీ పార్ట్‌నర్స్‌గా పనిచేస్తున్నవారంతా ప్రజల ఆహార అవసరాలను తీర్చారని కొనియాడారు. వారే తమ సంస్థకు వెన్నెముక లాంటి వారనీ, డెలివరీ పార్ట్‌నర్స్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు.

మొదటి దశలో భాగంగా 5,500 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌కు టీకా అందించనున్నట్టు సంస్థ యాజమాన్యం తెలిపింది. మొత్తంగా 2 లక్షల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని స్విగ్గీ పేర్కొంది.


Next Story

Most Viewed