బ్రేకింగ్ న్యూస్: కేసీఆర్‌పై స్వామి‌గౌడ్ ఫైర్ ?

by  |
బ్రేకింగ్ న్యూస్: కేసీఆర్‌పై స్వామి‌గౌడ్ ఫైర్ ?
X

దిశ, న్యూస్ బ్యూరో : ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడిగా టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు అన్ని రకాలుగా అండదండగా ఉండి, లాఠీ దెబ్బలు కూడా తిన్న స్వామిగౌడ్ ఒక్కసారిగా బాంబు పేల్చారు. అధికార పార్టీ హవా సాగుతున్న తరుణంలో ప్రతిపక్షాలు కూడా నోరెత్తలేని సమయంలో మొన్నటిదాకా మండలికి నాయకత్వం వహించిన స్వామిగౌడ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శలకు దిగారు. డబ్బుల మూటలతో వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు అయినవారిని తూర్పార బట్టారు. వందలు, వేల కోట్లతో వచ్చేవారిని, హత్యలు చేసేవారిని రాజకీయాల్లో దించి పెద్దపీట వేస్తున్నారంటూ ఒక సామాజికవర్గానికి చెందిన మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు. మొన్నటి దాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న స్వామిగౌడ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అధికార పార్టీకి టార్గెట్‌గా ఉండే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని, ఆయనను పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీంతో టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరిగిపోతోందా అనే అనే చర్చ మొదలైంది.

ప్రొటోకాల్‌కే పరిమితం

ఉద్యమం నుంచే వెన్నంటి నడిచిన స్వామిగౌడ్‌ను మండలి ఛైర్మన్ చేసినా, ప్రొటోకాల్‌కే పరిమితం చేశారనేది ముందు నుంచే ఉంది. కేబినెట్‌లోకి తీసుకుంటారనుకున్నా మండలి పదవినే అప్పగించారు. ఆ తరువాత సీఎం కేసీఆర్ కనీసం దగ్గరకు రానీయలేదని స్పష్టమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం కోసం సీఎం కేసీఆర్‌ను వేడుకున్నారు. అది కూడా దక్కలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ టికెట్ వస్తుందని మభ్యపెట్టారు. అది కూడా వేరేవాళ్లు తన్నుకుపోయారు. కార్పొరేషన్ పదవి కోసం ప్రయత్నించారు. దానినీ సాగనీయలేదు. ఏడాదిన్నర కాలంగా కనీసం ఆయనకు సీఎం అప్పాయింట్‌మెంట్ కూడా లభించడం లేదు. కేసీఆర్‌ను కలిసేందుకు ఓ ఎంపీకి వందలసార్లు మెస్సేజ్ చేశానని, కాల్స్ చేశానని, ఒక్కసారి కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని స్వామిగౌడ్ స్వయంగా త“““న సన్నిహితుల దగ్గర వాపోయారు. సీఎం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2008 వరకు కొన్నిఉద్యోగ సంఘాలే టీఆర్ఎస్, కేసీఆర్ వెంట నడిచాయి. అతి పెద్ద సంఘంగా ఉన్న ఎన్జీవో యూనియన్ మాత్రం ఉద్యమంలో పాల్గొనలేదు. 2008 తర్వాత ఎన్జీఓస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన స్వామిగౌడ్ ఉద్యమానికి ఊతమిచ్చారు. ఎన్జీవోలను ఉద్యమంలో భాగస్వామ్యం చేశారు. కిందిస్థాయి నుంచి ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొనడంలో స్వామిగౌడ్‌దే కీలకపాత్ర. ఈ పరిణామాల్లో పోలీసుల దెబ్బలకు స్వామిగౌడ్ సర్వం కోల్పోయారు. ఆరోగ్యంగా దెబ్బతింది. అయినా, 2018 వరకూ కేసీఆర్‌కు వెన్నంటి నడిచారు. ప్రాధాన్యం ఇవ్వకున్నా మౌనంగానే ఉన్నారు. స్వామిగౌడ్‌కు తెలంగాణలో మంచి అవకాశాలు ఉంటాయని భావించారు. అవి ఊహాగానాలుగానే మిగిలాయి. మండలి ఛైర్మన్ పదవీ కాలం పూర్తయ్యాక ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారిని పక్కనపెట్టడం, తెలంగాణ ఉద్యమంలో కలిసి రాకుండా, ఉద్యమకారులపై కేసులు పెట్టించి, పోలీసులతో కొట్టించిన వారిని టీఆర్ఎస్ పార్టీ దగ్గరకు తీస్తోందనే ప్రచారం ఇటీవల మరింత జోరందుకుంది. చాలా మందికి కార్పొరేషన్ పదవులను పొడిగించడం, కొత్తవారికి కీలక బాధ్యతలను అప్పగిస్తుండటంతో ఉద్యమ నేతలు అవమానకరంగానే భావిస్తున్నారు.

గచ్చిబౌలి భూములపై

ఏండ్ల నుంచి కొట్లాడుతున్నగచ్చిబౌలి భూముల వ్యవహారంలో కూడా స్వామిగౌడ్ కొంత బాధతో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రభుత్వం తొలి విడతలో కొంత భూమిని రెగ్యులర్ చేసింది. ఆ తర్వాత స్వరాష్ట్రంలో ఉద్యోగులు మంచి రోజులు ఉంటాయని, గచ్చిబౌలిలో ఇండ్లు వస్తాయని ఆశతో ఉన్నారు. గచ్చిబౌలిలో మరో 100 ఎకరాలకుపైగా క్రమబద్దీకరించాల్సి ఉందని సీఎం కేసీఆర్ దగ్గరకు రెండేండ్ల నుంచి తిరుగుతూనే ఉన్నారు. స్వామిగౌడ్ ఏడాదిన్నర కాలంగా దీనికోసం ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు. ఆ ఫైల్ ముందుకు కదలడం లేదు. ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతూనే ఉంది. ఎన్ని రోజులు పెండింగ్లో పెడుతారంటూ స్వామిగౌడ్ ఇటీవల ఓ ఉన్నతాధికారిపై ఆగ్రహించినట్లు సమాచారం.

సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలోనే స్వామిగౌడ్ సంచలను వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో కొన్ని కొన్ని కులాలకు చెందినవారే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నారు. వందేళ్ల క్రితం ఏర్పడ్డ కుల రక్కసి పునా దులే ఇప్పటికీ పరిపాలనను కొనసాగిస్తున్నాయి. ఇది బలహీన వర్గాలపై జరుగుతున్న దాడి. దేశంలో గుడి, బడి కొంతమందికే పరిమితి కావడం, మళ్లీ మొదటికి రావడం వల్లే నారాయణ గురును గుర్తు చేసుకుంటున్నాం. కులం, మతం పక్కన పెట్టి ఎవరికైతే తెలివితేటలు ఉంటాయో, ఎవరైతే పరిపాలన సాగించగలరో, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరో, అలాంటి వ్యక్తులు ఏకరూప సిద్ధాంతంపై ఏకమయ్యే రోజు త్వరలోనే రాబోతుంది.” అన్నారు స్వామిగౌడ్. రూ. 2500 కోట్లు ఉన్న వ్యక్తిని ఒక పార్టీ నిలబెడితే, రూ. 3500 కోట్లు ఉన్న వ్యక్తిని మరో పార్టీ నిలబెడుతుందని వ్యాఖ్యానించారు. ఒక పార్టీ పది మందిని చంపినోడిని నిలబెడితే, మరో పార్టీ 15 మందిని చంపినోడిని నెలబెడుతోందని అన్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కలకు చెందిన ఓ మంత్రిని ఉద్ధేశించి మాట్లాడారంటూ చర్చకు దారి తీసింది. ఇక్కడే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని సైతం స్వామిగౌడ్ పొగడ్తలతో ముంచెత్తారు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గం అయినా బడుగు, బలహీన వర్గాలకు చేతికర్రగా మారారని స్వామిగౌడ్ చెప్పడం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో గవర్నర్‌పై టిఆర్ఎస్ నేతల కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. ట్విట్టర్‌లో పోస్టు పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి వెంటనే దానిని డిలీట్ చేశారు. తాజాగా శాసనమండలి మాజీ ఛైర్మెన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులకు స్వామిగౌడ్ వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్లు అవుతున్నాయి. కనీసం డీఏకు కూడా నోచుకోకుండా ఉన్న ఉద్యోగులు ప్రభుత్వంపై చాలా ఆగ్రహంతో ఉన్నారు.

Next Story

Most Viewed