భారీగా రోడ్ల మీదకొచ్చిన విద్యార్థులు.. హుటాహుటిన ఆఫీసుకు ఎమ్మెల్యే

by  |
Students protest
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ‘‘ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేస్తే మహిళలకు రక్షణ ఎలా ఉంటుంది సార్. విద్యాసంస్థలకు సమీపంలో వైన్‌ షాపులు ఏర్పాటు చేయడం మూలంగా చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు కూడా మద్యానికి బానిస అవుతున్నారు. వెంటనే మా విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న వైన్ షాపులను తొలగించాలి. లేదంటే డిసెంబర్ 2వ తేదీన మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం’’ అని విద్యార్థినులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో గత కొన్నేండ్లుగా రెండు మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు సమీపంలోనే ఈ మద్యం షాపులు ఉండడంతో విద్యార్థినులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇక్కడి నుంచి మద్యం షాపులను తొలగించాలని, గతంలోనే పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశామని అయినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.

Students protest

ఈ నేపథ్యంలో శనివారం విద్యార్థినులు అందరూ ఏకమై పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి అలంపూర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు చేరుకొని బైఠాయించారు. మద్యం దుకాణాలను తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని వివరించారు. ‘‘మీరు ఎమ్మెల్యేకు చెప్పి మార్పిస్తారా? లేక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరో చోటికి తరలిస్తారో మీ ఇష్టం’’ అంటూ అధికారులను నిలదీశారు. విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం వెంటనే తన క్యాంపు కార్యాలయానికి చేరుకొని విద్యార్థినులను శాంతింపజేశారు. తప్పకుండా వైన్ షాపులను తరలించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.

Students protest


Next Story

Most Viewed