అప్పుడు తోడు ‘కారా’!

by  |
అప్పుడు తోడు ‘కారా’!
X

దిశ, హైదరాబాద్:
సామాజిక జీవనంలో పిల్లలు లేకపోవడం భార్యాభర్తలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. తోటి కుటుంబాలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే మనసులో ఎక్కడో తెలియని వెలితి. అంతే కాదు, మన కుటుంబానికి ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం.. ఈ ఆస్తిని అనుభవించే వారు లేకుంటే ఎలా.. సమీప భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వస్తే? లేదంటే, అనారోగ్యానికి గురైతే మనల్ని చూసుకునేదెవరు? వృద్ధాప్యంలో మనకు తోడుగా ఉండేదెవరు ? ఇలా అనేక సందేహాలతో రేపటి పరిస్థితులు ఊహాల్లో మెదులుతుంటాయి. ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవడమే వీటన్నింటికీ పరిష్కారంగా కనపడుతోంది. ఒకప్పుడు దత్తత చుట్టూ అనేక వివాదాలు చేరేవి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ – సీఏఆర్ఏ(కారా) ప్రత్యేక నియమ నిబంధనలను విడుదల చేసింది. దీంతో దత్తత తీసుకోవడం తప్పనిసరిగా చట్టబద్ధంగా మారింది.

వెయ్యికి 964 గురు మాత్రమే..

ఒకప్పుడు అమ్మాయిలు అంటే సమాజంలో చిన్నచూపు ఉండేది. శాస్త్ర, సాంకేతిక రంగాలు మరింత అభివృద్ధి చెందడం, అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గతంలో కంటే వివక్ష కొంత మేర తగ్గిందనే చెప్పొచ్చు. అయినా కూడా ఇంకా ఎక్కడో ఓ చోట వేధింపులు, మహిళలను చిన్నచూపు చూడటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం 1,000 మంది అబ్బాయిలకు 964 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నట్టు 2019 డిసెంబర్ నాటి సెక్స్ రేషియో గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్క గతం కంటే పెరిగినా కూడా బాలురకు సమానస్థాయిలో బాలికల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రజల్లో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిర్వహణలో సెంట్రల్ అడాప్షన్ అథారిటీ(కారా) ద్వారా పిల్లల దత్తత విభాగం పనిచేస్తోంది. ఆసక్తి కలిగిన పేరెంట్స్ దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. అందుకు జిల్లాలోని మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది నియమ, నిబంధనలను వివరిస్తూ.. అందుకు తగిన కౌన్సిల్ నిర్వహిస్తారు. వారి కుటుంబానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో జత చేయాల్సి ఉంటుంది.

అత్యధికంగా అమ్మాయిల కోసమే..

పిల్లలను దత్తత తీసుకునే వారిలో సంతాన లేమి వారు, ఒంటరి మహిళలే అత్యధికంగా ఉంటున్నారు. ఇటీవల నన్స్ కూడా పిల్లలను దత్తత తీసుకోవటం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలకు వస్తూ తమ పేర్లను నమోదు చేసుకోవటం విశేషం. అయితే, వీరిలో 80 శాతం మంది అమ్మాయిలను మాత్రమే కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అబ్బాయిలను దత్తత తీసుకుంటే పెండ్లి చేసుకున్న తర్వాత వేరు కాపురం పెడితే మమ్ములను చూసుకునే వారుండరనే కారణం ఒకటి కాగా, ప్రభుత్వ హోమ్‌లలో అత్యధికంగా అమ్మాయిలే అందుబాటులో ఉండటం మరో కారణం. అబ్బాయిలు తక్కువగా ఉన్న కారణంగా ప్రక్రియ ఏండ్ల తరబడి కొనసాగే వీలున్నందున అత్యధిక జంటలు అమ్మాయిలనే కోరుకుంటున్నారు. చదువుకున్న వారంతా వారికున్న అవగాహన మేరకు దత్తత కోసం అమ్మాయిలనే కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకూ 1,004 మంది పిల్లలను దత్తత ఇచ్చింది. ఇంకా 1,798 మంది వెయిటింగ్ జాబితాలో ఉన్నారు. వీరిలో దత్తత తీసుకున్న (1004) వారిలో 226 మంది అబ్బాయిలు కాగా, 778 మంది అమ్మాయిలే ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 2014 నుంచి 2019 వరకూ 1,300 మంది పిల్లల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 500 మందికి దత్తత ఇచ్చారు. ఇంకా 800 మంది వెయిటింగ్‌లో ఉన్నారు.

వివక్ష.. ఆదరణ

అమ్మాయిలు ఇంత పెద్ద సంఖ్యలో హోమ్‌లకు చేరాల్సిన పరిస్థితులను మనం గమనించాల్సి ఉంది. వీరిలో అనాథలు, సింగిల్ పేరెంట్స్‌తో పాటు ఆడ పిల్లలు పుడితే మేం సాకలేమంటూ ప్రభుత్వ హోమ్‌లకు అప్పగించిన వారూ లేకపోలేదు. ఇక్కడ ఇంత మంది అమ్మాయిలు హోమ్‌లకు చేరడమంటేనే.. వివక్షకు, నిరాదరణకు గురవుతున్నట్టు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ప్రభుత్వ హోమ్‌ల నుంచి అమ్మాయిలనే ఎక్కువగా దత్తత తీసుకుంటున్నారంటే.. సమాజంలో అమ్మాయిల పట్ల వివక్ష తగ్గినట్టుగా భావించాలా? లేదా.. అమ్మాయిలను ఆదరించే వారు పెరిగారని సంతోషపడాలో అర్థం కాని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో మరి!

tags : adoption, Orphan , Women and Child Welfare, Stree Shakti


Next Story

Most Viewed