రుణాలు.. ఊరటలు.. వెసులుబాటులు

by  |
రుణాలు.. ఊరటలు.. వెసులుబాటులు
X

న్యూఢిల్లీ: కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక, ద్రవ్య ప్యాకేజీని ప్రకటించారు. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరుతో దీనిని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. సుమారు రూ. 6 లక్షల కోట్ల కేటాయింపులను తెలిపారు. ‘స్వావలంబనతో స్వీయ ఆధారిత భారత్’ పేరుతో ఈ ప్యాకేజీ ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడు నెలలపాటు రూ. 500, 5 కిలోల బియ్యం, కిలో పప్పు, 8 కోట్ల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈపీఎఫ్ వెసులుబాటులు ఇచ్చారు. టీడీఎస్, టీసీఎస్ రేట్లను తగ్గించారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. కాంట్రాక్టులను పూర్తిచేయడానికి అదనంగా ఆరు నెలల సమయం ఇచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల రుణాలను ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న డిస్కమ్‌లకు రూ. 90వేల కోట్ల మేర నగదు లభ్యత ఇస్తామని తెలిపారు.

రూ. 1.70 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ

ఆరోగ్య కార్యకర్తలకు రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారు. 80 కోట్ల మంది పేదలకు వచ్చే మూడు నెలలకు 5 కిలోల గోధుమలు లేదా బియ్యం, కిలో పప్పు ఉచితంగా ఇవ్వనున్నారు. 20 కోట్ల మంది మహిళల జన్‌ధన్ ఖాతాదారులకు వచ్చే మూడు నెలలపాటు నెలకు రూ. 500 చొప్పున ఇవ్వనున్నారు. వచ్చే మూడు నెలలు 8 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. 13.62 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వేతనం రూ. 182 రూపాయల నుంచి రోజుకు రూ. 202లకు పెంచనున్నారు.

ఈపీఎఫ్ వెసులుబాటు

ఉద్యోగుల ఈపీఎఫ్ చెల్లింపుల కింద రూ. 2500 కోట్లను ప్రకటించారు. ఉద్యోగులకు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. 70.22 లక్షల మంది ఉద్యోగుల ఈపీఎఫ్‌ను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రూ. 15 వేల లోపు జీతం ఉన్నవారికి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ చేస్తున్నట్లు గతంలోనే చెప్పినట్లు గుర్తుచేశారు. అంటే ఇప్పటికే మార్చి, ఏప్రిల్, మే నెలల ఈపీఎఫ్‌ను చెల్లించింది. దీన్ని మరో 3 నెలల వరకు పొడిగింపు అంటే జూన్, జూలై, ఆగస్టు కంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రైవేట్రంగ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ మూడు నెలలపాటు ఈపీఎఫ్ మొత్తాన్ని 12 శాతానికి బదులు 10 శాతం చెల్లించే వెసులుబాటును కేంద్రం ఇచ్చింది. రూ. 15 వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు కేంద్రం 24 శాతం పీఎఫ్ మొత్తం ఇవ్వనుంది. మూడు నెలల పాటు ఈ మొత్తాన్ని కేంద్రం ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. యజమానులు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ కేంద్రమే చెల్లించడం వల్ల సంస్థలు తమ వంతు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ నిర్ణయంతో ప్రైవేట్ సంస్థల యజమానుల చేతిలో లిక్విడిటీ ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే కేంద్రం చెల్లించే 12 శాతం కొనసాగుతుందన్నారు.

టీడీఎస్, టీసీఎస్ రేట్ల తగ్గింపు

టీడీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్ర మంత్రి శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ఉన్న టీడీఎస్, టీసీఎస్ రేట్లు 25 శాతం తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జీతం ఉన్న వారికి 5 శాతం టీడీఎస్ ఉంది. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు జీతం ఉన్న ఉద్యోగులకు 20 శాతం వరకు టీడీఎస్ ఉంది. ఏడాదికి రూ. 10 లక్షలకు మించి వేతనం ఉన్నవారికి 30 శాతం టీడీఎస్ వర్తిస్తోంది. ఈ తరుణంలో 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశేషం. టీడీఎస్‌ను 25 శాతం తగ్గించడం వల్ల జనాల చేతుల్లో రూ. 50,000 కోట్ల వరకు ఉంటాయని చెప్పారు. డిమాండ్ పెంచే ఉద్దేశంలో భాగంగా దీనిని తగ్గించామని ఆర్థికమంత్రి తెలిపారు. కాంట్రాక్ట్, ప్రొఫెషనల్ ఫీజు, వడ్డీ, అద్దె, డెవిడెండ్, కమిషన్, బ్రోకరేజీ ఇన్‌కమ్ వంటి వాటి కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుందన్నారు. ఈ నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని, మిగతా ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని పేర్కొన్నారు.

రియల్ ఎస్టేట్‌కు ఊరట

కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌తో చితికిపోయిన రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. సేవల, నిర్మాణ కాంట్రాక్టులకు అదనంగా ఆరు నెలల వరకు వెసులుబాటు ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల కాంట్రాక్టు పనులను పూర్తిచేయడానికి 6 నెలలు అదనంగా సమయం ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కాంట్రాక్టర్ల బ్యాంకు గ్యారంటీలను పనులు పూర్తయిన స్థాయిని బట్టి పాక్షికంగా విడుదల చేయాలి. ఈ వెసులుబాటు ఇవ్వడం ద్వారా కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత కొరత కొంతవరకు తగ్గుతుందని ఆర్థిక మంత్రి వివరించారు. కొవిడ్‌ సంక్షోభాన్ని పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’గా పరిగణించి ప్రాజెక్టు ఒప్పందాల అమలుకు సంబంధించిన మార్పులు సూచిస్తున్నామన్నారు.

రూ.5 కోట్ల టర్నోవర్ ఉంటే ఎంఎస్ఎంఈలు

కరోనా సంక్షోభంతో ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం ఊరటనిచ్చింది. పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్లు రుణాలుగా ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ రుణాలతో 45 లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు లబ్ధి చూకురుతుందని ఆమె ఆకాంక్షించారు. 4 ఏండ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియంతో రుణాలు మంజురు చేస్తామన్నారు. తీవ్ర ఒత్తిళ్లలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ. 20,000 కోట్ల సబార్డినేట్ రుణాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో 2 లక్షల మంది వ్యాపారాలకు లబ్ధి చేకూరుతుంది. ఎంఎస్ఎంఈ ఫండ్ క్రియేట్ చేస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. ఇదే సందర్భంలో ఎంఎస్ఎంఈల నిర్వచనం కూడా మారబోతోందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రూ. 25 లక్షల పెట్టుబడి ఉన్న సంస్థలను మాత్రమే మైక్రో కంపెనీలుగా గుర్తిస్తున్నామని, భవిష్యత్తులో రూ. 5 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు కూడా మైక్రో ఎంఎస్ఎంఈల కిందకు వస్తాయని ఆమె వివరించారు. ఇక నుంచి టర్నోవర్ ఆధారంగా చిన్న వ్యాపారాలను నిర్వచించే విధానం ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలకు రూ. 30 వేల కోట్ల మేర నగదు లభ్యత కల్పిస్తామన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలకు రూ. 45 వేల కోట్లు పాక్షిక క్రెడిట్‌ గ్యారెంటీ ఇస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ఎన్‌పీఏ ముప్పు ఉంటే..

ఎంఎస్ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ. 50వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం రూ. 10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్ ఫండ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్‌పీఏ ముప్పు ఎదుర్కొంటున్న ఏదైనా ఎంఎస్ఎంఈ ఈ సదుపాయం ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుందని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

200 కోట్లలోపు కొనుగోళ్లకు దేశీయ సేకరణ

ఎంఎస్ఎంఈల గురించి కొంత అయోమయం కనిపిస్తోంది. ఇప్పుడు వాటికి మేలు చేసేలా కొత్త నిర్వచనం ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్‌ తెలిపారు. ఎంఎస్ఎంఈల పెట్టుబడి పరిమితిని పెంచుతున్నామని, పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చినా ఎంఎస్ఎంఈ పరిధిలోనే ఉంటారు. ప్రభుత్వ కొనుగోళ్లలో రూ. 200 కోట్ల విలువ వరకు దేశీయంగానే సేకరణ జరుగుతుంది. రూ. 200 కోట్ల లోపు జరిగే కొనుగోళ్లలో గ్లోబల్‌ టెండర్లకు అవకాశం లేదని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90 వేల కోట్లు

సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడుల పరిధిని రూ. 25 లక్షల నుంచి రూ. కోటికి పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి వివరించారు. రూ. 5 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలను సైతం సూక్ష్మ పరిశ్రమలుగా గుర్తిస్తామన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలకు రూ. 30వేల కోట్ల మేర నగదు లభ్యత కల్పిస్తాం. ఎన్‌బీఎఫ్‌సీలకు రూ. 45 వేల కోట్లు పాక్షిక క్రెడిట్‌ గ్యారెంటీ ఇస్తాం. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న డిస్కమ్‌లకు రూ. 90వేల కోట్ల మేర నగదు లభ్యత ఇస్తాం. ప్రభుత్వ కొనుగోళ్లలో ఈ మార్పు ఎంఎస్‌ఎంఈలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దేశంలోని అన్ని విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కమ్)కు రూ. 90 వేల కోట్ల మొత్తాన్ని లిక్విడిటీ రూపంలో కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీంతో విద్యుత్ వినియోగదారులకు కొంత ఊరట లభిస్తుందని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల డిస్కమ్‌ల ఆదాయం క్షీణించినట్లు అంచనా వేశామన్నారు. డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు, దీనికోసం రూ. 90 వేల కోట్ల లిక్విడిటీని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.


Next Story