భారీ ఆఫర్ : స్టాక్ క్లియరెన్స్ సేల్.. అన్ని వ్యాక్సిన్లపై డిస్కౌంట్

by  |
భారీ ఆఫర్ : స్టాక్ క్లియరెన్స్ సేల్.. అన్ని వ్యాక్సిన్లపై డిస్కౌంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఒకప్పుడు టీకా పొందాలంటే స్లాట్స్ లేవని రోజుల తరబడి వేయిట్ చేయించిన ప్రైవేట్ ఆసుపత్రులు, నేడు ‘వ్యాక్సిన్ వేసుకొండి అంటూ ’ ప్రకటనలు ఇస్తున్నాయి. ప్రతీ డోసుకు డిస్కౌంట్ ఇస్తామని చెబుతున్నాయి. అంతేగాక సర్వీస్ ఛార్జీలను సైతం తీసుకోబోమంటున్నాయి. ఆన్ లైన్‌తో సంబంధం లేకుండానే స్పాట్ రిజిస్ర్టేషన్ ద్వారా పంపిణీ చేస్తామని పేర్కొంటున్నాయి. కొన్ని చిన్న, మధ్యతరహా ఆసుపత్రులైతే ఎంఆర్‌పీ ధరలకూ డోసులను ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. ప్రభుత్వ కేంద్రాల్లో పుష్కలంగా టీకాలు అందుబాటులో ఉండటంతో ప్రైవేట్‌లో డబ్బులు ఖర్చు పెట్టి మరీ టీకా పొందేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని అపోలో ఆసుపత్రికి చెందిన ఓ డాక్టర్ చెప్పారు. దీంతోనే వ్యాక్సిన్లకూ ఆఫర్లు పెట్టాల్సి వస్తుందని ఆయన వివరించారు.

ఫుల్ స్టాక్.. నో గిరాకీ..

రాష్ర్టవ్యాప్తంగా 200 పైగా ప్రైవేట్ కేంద్రాల్లో టీకా పంపిణీ జరుగుతున్నది. ఈ సెంటర్లకు మొదట్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే టీకాలు ఇవ్వగా, ఆ తర్వాత నేరుగా తయారు కేంద్రాల నుంచి డోసులను కొనుగోలు చేసే వెసులుబాటును కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కల్పించాయి. దీంతో 80 శాతం ఆసుపత్రులు ముందస్తుగానే తయారీ కేంద్రాల్లో నుంచి భారీ స్థాయిలో డోసులను కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నాయి. కానీ ప్రభుత్వ కేంద్రాలు పెరగడం, మొబైల్ వాహనాల ద్వారా టీకాలు ఇవ్వడం వంటి వాటితో ప్రైవేట్‌కు వెళ్లే వారి సంఖ్య 70 శాతం పడిపోయింది. దీంతో వాటి గడువు తేది కేవలం ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో ముందస్తుగా నింపుకున్న స్టాక్‌ను ఎలా క్లియర్ చేయాలో? తెలియక ప్రైవేట్ యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇక కొన్ని ఆసుపత్రులైతే ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సగం ధరలకూ ఇచ్చేస్తున్నాయి. మరోవైపు లబ్ధిదారుల సంఖ్య కూడా క్రమేణా తగ్గుతుండటంతో టీకాల నిల్వను క్లియర్ చేస్తున్నామని సికింద్రాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి మేనేజర్ వెల్లడించారు.

సర్కార్ సెంటర్లు ఖాళీ…

రాష్ర్ట వ్యాప్తంగా 1389 సర్కార్ కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ విస్తృతంగా జరుగుతున్నది. దీంతో పాటు సుమారు 200 మొబైల్ వాహనాలతోనూ రద్ధీ ప్రదేశాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తున్నారు. అత్యధిక సెంటర్లలో టీకా పంపిణీ వేగంగా జరుగుతున్నందున అన్ని కేంద్రాల్లో రద్దీ తగ్గింది. గతంలో గంటల తరబడి నిలబడిన వారు నేడు కేవలం 5 నిమిషాల్లో టీకాను పొందుతున్నారు. పైగా అబ్జర్వేషన్ సమయం కూడా అవసరం లేదు. దీంతో జనాలంతా ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిషీల్డ్ సింగల్ డోసుకు రూ.750 నుంచి 800, కొవాగ్జిన్ రూ.1200 నుంచి 1450, స్పుత్నిక్ రూ.1450 నుంచి 1600 వరకు తీసుకుంటున్నారు. దీనికి అదనంగా కొన్ని హాస్పిటల్స్ ప్రభుత్వం సూచించిన రూ.150 సర్వీస్ ఛార్జీని తీసుకుంటుండగా, మరి కొన్ని వసూలు చేయడం లేదు. ఆ ధరలు వెచ్చించి ప్రైవేట్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన అవసరమేందని చాలా మంది సర్కార్ సెంటర్లకు వెళ్తున్నారు.

అప్పట్లో సర్కార్ లేట్ ప్రక్రియ

రెండు నెలల క్రితం టీకాల కొరత, ప్రభుత్వ కేంద్రాల్లో ఆలస్యం అయినందున చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించారు. రెట్టింపు ధరలు ఇచ్చి వ్యాక్సిన్ పొందిన వారూ ఉన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయింది. సగం ధరలకు పంపిణీ చేస్తామన్నా, తీసుకునే వారు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
-ఓ కార్పొరేట్ హాస్పిటల్ మేనేజర్

నెల రోజుల ముందే అడిగారు..

రెండు మూడు నెలల క్రిందట యశోదా గ్రూప్స్‌కు చెందిన ఒక్కో హాస్పిటల్‌కు సుమారు 500 నుంచి 1000 మంది టీకా కొరకు ఆశ్రయించే వారు. చాలా మందికి నెల రోజుల తర్వాత డేట్ ఇచ్చినా వ్యాక్సిన్ కోసం వేచిచూసేవారు. కానీ ప్రభుత్వ కేంద్రాల్లో విరివిగా టీకాలు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ప్రతీ రోజు గరిష్ఠంగా 100 మందికి మించడం లేదు. ఇప్పటికే నిల్వ ఉన్న స్టాక్‌ను క్యాంపులతో క్లియర్ చేస్తున్నాం.
-యశోదా గ్రూప్స్ అడ్మినిస్ర్టేటీవ్ అధికారి


Next Story

Most Viewed