కరోనా సంఖ్యలపై హైరానా

by  |
కరోనా సంఖ్యలపై హైరానా
X

న్యూఢిల్లీ: కరోనా కేసులు, రికవరీలు, మరణాల సంఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకత పాటించడం లేదు. హాస్పిటళ్లు వెల్లడిస్తున్న కరోనా కేసుల సంఖ్యకు రాష్ట్రాలు ప్రకటిస్తున్న హెల్త్ బులెటిన్‌లోని సంఖ్యకు ఒక్కోసారి పొంతన కుదరడం లేదు. ఇక కరోనా మరణాల విషయంలో చాలా రాష్ట్రాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ సంఖ్యను ఏరోజుకారోజు ప్రకటించడకుండా కొన్ని రోజుల సంఖ్యను ముద్దగా కలిపి ప్రకటిస్తున్నాయి. ఇప్పటివరకూ కొత్త కేసులు, రికవరీలు, మృతుల సంఖ్యపై పారదర్శకంగా వ్యవహరించిన రాష్ట్రాలూ ఇప్పుడు కరోనా సంఖ్యలపై పారదర్శకతకు తిలోదకాలిస్తున్నాయి.

కరోనా మరణాలపై కంగారు

కరోనా కొత్త కేసులు, రికవరీలు, మరణాల సంఖ్యలను తమిళనాడు, కేరళ, కర్ణాటకలు ప్రతిరోజూ తప్పకుండా వెల్లడిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు గతంలో వెల్లడించినట్టుగా కాకుండా కొన్ని పరిమితులను విధించుకుని వివరాలను వెల్లడిస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా కరోనా మరణాలను ప్రకటించడంపై ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర సహా పలురాష్ట్రాలు హైరానా పడుతున్నాయి. అందుకే రోజువారీగా కాకుండా కొన్ని రోజుల మరణాల సంఖ్యను కలిపి ప్రకటిస్తున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ పరిశీలిస్తే శుక్రవారం వెయ్యికిపైగా కొత్త కరోనా కేసులతోపాటు 82 మరణాలు చోటుచేసుకున్నట్టు ఢిల్లీ వెల్లడించింది. ఇందులో 13 మరణాలు మాత్రమే శుక్రవారం చోటుచేసుకున్నాయి. అదీగాక, ఢిల్లీలో మరణాల సంఖ్యపైనా పలు లోపాలున్నట్టు తెలుస్తున్నది. ఢిల్లీలోని లోక్‌నాయక్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, లేడీ హార్డింగే మెడికల్ కాలేజీ, ఎయిమ్స్ ఢిల్లీ, జాజ్జర్ సెంటర్‌లలో ఈ నెల మొదట్లో(రెండో వారంలో) 116 కేసులు వెలుగుచూసినట్టు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. కానీ, ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం మాత్రం 66 మరణాలు మాత్రమే చోటుచేసుకున్నాయని, అందులోనూ పైన పేర్కొన్న హాస్పిటళ్లలో 33 కేసులు మాత్రమే రిపోర్ట్ అయినట్టు వెల్లడించడం గమనార్హం. తర్వాత కొన్ని ఏజెన్సీల మధ్య సమన్వయలోపంతో ఇలాంటి పొరపాట్లు తలెత్తాయని ఢిల్లీ ప్రభుత్వం వివరించి క్రమంగా ఆ తేడాను పూడ్చుకుంటూ వచ్చింది. (ఢిల్లీలో మరణాలు ప్రధానంగా కరోనాతోనే సంభవించాయా? లేదా? అని నిర్ధారించే ప్రత్యేక డెత్ ఆడిట్ కమిటీ ఉండటం గమనార్హం.) ఢిల్లీతోపాటు మరికొన్ని రాష్ట్రాలూ కరోనా మరణాలపై పారదర్శకత వహించడానికి వెనుకాడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ కూడా గతంలో ఈ పరిస్థితినే ఎదుర్కొన్నది. అధికారిక లెక్కల్లో ముందుగా కలుపుకోని కొన్ని మరణాలను తర్వాత చేర్చుకోవలసి వచ్చింది. కరోనా సంఖ్యలపై పారదర్శకత వహించిన గుజరాత్ ప్రభుత్వం కొన్ని రోజులుగా కరోనా మరణాలను వెల్లడించడమే మానేసింది. ఆ రాష్ట్ర రోజువారీ బుల్లెటిన్‌లలోనూ పారదర్శకత లోపించింది. ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డుల్లోనూ మిగతా రాష్ట్రాల్లా కాకుండా కరోనా మరణాల వివరాలను వెల్లడించడం లేదు. మహారాష్ట్ర కూడా కొవిడ్ మృతుల సంఖ్యను ఏరోజుకారోజు విడివిడిగా కాకుండా కొన్ని రోజుల సంఖ్యను కలిపి ప్రకటిస్తున్నది. ఈ డైలీ హెల్త్ బుల్లెటిన్‌లో ఒక్కోసారి రెండు వారాల కరోనా మరణాల సంఖ్యనూ కలిపి ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

కేసులతో పెరుగుతున్న కలవరం

ఇరుకులోపెట్టే సంఖ్యలకు కళ్లెం వేయడానికి కొన్ని రాష్ట్రాలు ఇతరత్రా చర్యలకు పాల్పడే యత్నం చేస్తున్నట్టు కొందరు నిపుణులు ఆరోపిస్తున్నారు. కరోనా మరణాలపై అస్పష్టత మెయింటెయిన్ చేయడం, ఆ మరణాలను ధ్రువీకరించకపోవడం, లేదా టెస్టింగ్‌లనే తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కరోనా టెస్టింగ్ వివరాలను వెల్లడించకపోవడంపై అనుమానాలను లేవనెత్తుతున్నారు. ఇప్పటి వరకు మనదేశంలో కరోనా టెస్టుల వివరాలను వెల్లడించని ఏకైక రాష్ట్రం తెలంగాణనే కావడం గమనార్హం. దీనిపైనే రాష్ట్ర హైకోర్టు ఆగ్రహానికీ గురికావలసి వచ్చింది. కాగా, ఏ రాష్ట్రానికీ చెందని కరోనా కేసుల సంఖ్య శనివారంనాటికి ఐదువేలను దాటింది. (వ్యక్తిగత వివరాల్లో లోపాలున్న కరోనా పేషెంట్‌ల సంఖ్యను ‘కేసెస్ బీయింగ్ రీఅసైన్డ్ టు స్టేట్స్’ అనే కేటగిరీలో కేంద్రం నమోదు చేస్తున్నది. ఇందులో చాలా వరకు వలస కూలీలే ఉన్నట్టు సమాచారం) ఏ రాష్ట్రమూ తమవారేనని చేర్చుకోని పేషెంట్లే వీరంతా. కరోనా కేసుల సంఖ్యను ఇంకా పెంచి చూపెట్టుకోవడం ఇష్టపడకే రాష్ట్రాలు వాటిని చేర్చుకోవడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.


Next Story