పేరెంట్స్ బీఅలెర్ట్.. కార్పొరేట్ ముసుగులో ‘శ్రీచైతన్య’ నకిలీ లీలలు

153

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీచైతన్య లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. కరోనాతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోని యాజమాన్యం.. తమ పని నేరవేర్చుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అడ్డదారులను వినియోగించుకుంది. శ్రీచైతన్య నాచారం బ్రాంచ్‌కి సీబీఎస్‌ఈ అనుమతి పొందడం కోసం నకిలీ రికార్డులు, ఉపాధ్యాయులను కూడా తయారు చేసిందీ కార్పొరేట్ విద్యాసంస్థ..

రాష్ట్రంలోని విద్యావ్యవస్థను శాసిస్తున్న ‘శ్రీచైతన్య’ తాను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా దిగజారుతోంది. కార్పొరేట్ విద్యవ్యవస్థలో మోనోపలిగా ఎదిగిన శ్రీచైతన్య యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు అన్ని ఎత్తుగడలను ప్రయోగిస్తోంది. తాజాగా శ్రీచైతన్యలో సీబీఎస్‌ఈ అనుమతి పొందిన నాచారం బ్రాంచ్ కథే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం గా నిలుస్తోంది. హైదరాబాద్‌లో ఏడు బ్రాంచిల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అందిస్తోంది. అందులో నాచారం శ్రీచైతన్య ఒకటి. రెండు నెలల క్రితమే ఈ స్కూల్‌కు ఎనిమిదో తరగతి వరకూ సీబీఎస్‌ఈ అనుమతి లభించింది. అయితే ఇక్కడ 9,10 తరగతులు కూడా నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ స్కూల్‌కు సీబీఎస్‌ఈ అనుమతి పొందేందుకు యాజమాన్యం కనీసం ఆరు నెలలకు తగ్గకుండా అన్ని ప్రయోగాలు చేసింది. స్కూల్‌లో లేని సిబ్బంది, జీతాలు, సౌకర్యాలు కూడా ఉన్నట్టు పేర్కొనడం విశేషం. అక్టోబర్ 2న సీబీఎస్ఈ బోర్డు నుంచి ఇద్దరు సభ్యులు నాచారం శ్రీచైతన్య బ్రాంచిని సందర్శించారు. గాంధీ జయంతి జాతీయ సెలవు దినం అయినప్పటికీ, బోర్డు సభ్యులు తనిఖీ చేయడం, సభ్యులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు దారితీస్తోంది.

తొలిసారిగా ‘శ్రీచైతన్య’ ఐడీ కార్డులు..

శ్రీచైతన్య స్కూళ్లలో ఇప్పటివరకూ ఉపాధ్యాయులకు అధికారికంగా ఐడీ కార్డులు ఇచ్చే సంప్రదాయం లేదు. అయితే సీబీఎస్‌ఈ బోర్డు సభ్యులు తనిఖీలకు వస్తున్న నేపథ్యంలో నాచారం బ్రాంచి పేరు మీద ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు కూడా ముద్రించారు. నాచారం స్కూల్‌కు అనుమతి పొందేందుకు సిటీలోని ఇతర బ్రాంచిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గతేడాది ఆగస్టు నుంచి ఇక్కడ పనిచేయించారు. బోర్డు సభ్యులు స్కూల్‌ పర్యటన ముగించిన వెంటనే యాజమాన్యం ఐడీ కార్డులను వెనక్కి తీసుకుంది. సీబీఎస్‌ఈ బోర్డుకు సమర్పించిన ఉపాధ్యాయుల రిజిస్టర్ ప్రకారం 52 మంది ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ స్కూల్‌లో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ అక్కడి బ్రాంచిలో పనిచేస్తున్నది కేవలం 16 మంది మాత్రమే.. మిగిలిన 36 మంది సిటీలోని ఇతర బ్రాంచిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులే. వీరికి ఇస్తున్న బేసిక్ జీతం కనీసం రూ.25 వేలు కాగా.. అన్ని అలవెన్స్‌లతో కలిపి గరిష్టంగా రూ.50 వేల వరకు ఇస్తున్నట్టు రికార్డుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి వారు అప్పటివరకూ తీసుకుంటున్న గరిష్ట జీతం కేవలం రూ.20 వేలు మాత్రమే కావడం గమనార్హం. ఇప్పటికీ శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు అందుకుంటున్న జీతం రూ.15వేల లోపు మాత్రమే. అయినా సీబీఎస్‌ఈ బోర్డు సభ్యులు అనుమతిచ్చారు.

జీతం లేకపోయినా ఉపాధ్యాయుల వెట్టిచాకిరి..

యాజమాన్యం రాసిన రికార్డుల్లో నిజం లేదని తెలిసినా ఉద్యోగం కోసం పనిచేయాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ బ్రాంచిలో తాము పనిచేయకపోయినప్పటికీ, వాస్తవ జీతానికి 2-3 రెట్లు ఇస్తున్నట్టు రిజిస్టర్లు రాసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. సీబీఎస్‌ఈ బోర్డు తనిఖీల కోసం వస్తుండటంతో ఇతర బ్రాంచిల్లో నుంచి ఇక్కడికి రప్పించి పని చేయించారు. కరోనాతో ఒక వైపు అందరూ భయపడుతున్న కాలంలోనూ టీచర్లను స్కూల్‌లో అనేక రకాల పనులకు యాజమాన్యం వాడుకుంది. కనీసం అప్పటివరకు ఇస్తున్న జీతాలను కూడా ఇవ్వలేదని పనిచేసిన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సెప్టెంబర్‌లో ఉపాధ్యాయులను స్కూల్‌కు రప్పించి టీచర్లతో పనిచేయించారు. జూన్ నెల నుంచి నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన నాలుగు నెలల డైరీలను వారం రోజుల్లో రాయించారు. లెసన్స్ ప్లానింగ్ చేయించారు.

సీబీఎస్‌ఈ నిబంధనలు అమలవుతున్నట్టు నిరూపించేందుకు క్లాస్ రూంల్లో చార్ట్‌లు రూపొందించడం, స్కూల్ ఆవరణలో లైబ్రరీని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ఆట స్థలంలోనూ ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ కోర్టుల మార్కింగ్ చేయించారు. యాజమాన్యం చర్యలకు సీబీఎస్‌ఈ బోర్డు నుంచి వచ్చిన సభ్యులు కూడా పూర్తి సహకారం అందించినట్టు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. జాతీయ సెలవు దినమయిన అక్టోబర్ 2వ తేదీన స్కూల్ తనిఖీ చేయడమేమిటని ప్రశ్న తలెత్తుతోంది. ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించిన పేర్కొన్న అంశాలు, జీతాలు అన్ని అబద్ధాలే. స్కూల్‌లో సమస్యలు, ఇబ్బందులను బోర్డు సభ్యులు అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అది కూడా యాజమన్యం మనుషుల ముందే ప్రశ్నించడంతో ఉపాధ్యాయులు ఏమీ చెప్పలేకపోయారు. నిజాయితీగా తనిఖీలు నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుందని యాజమాన్యం ఈ ఏర్పాటు చేసుకుందని, అందుకు బోర్డు సభ్యులు కూడా సహకరించారనేది స్పష్టమవుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..