సంక్షోభంలో జింబాబ్వే..కానీ త‌గ్గ‌లేదు, ఓట‌మి లేకుండా సూపర్-8కు..!

by velandi.Saikiran |

సంక్షోభంలో జింబాబ్వే క్రికెట్ ఉంది.కానీ త‌గ్గ‌లేదు, 2026 T20 ప్రపంచ కప్‌లో ఓట‌మి లేకుండా సూపర్-8కు దూసుకెళ్లింది.

సంక్షోభంలో జింబాబ్వే..కానీ త‌గ్గ‌లేదు, ఓట‌మి లేకుండా సూపర్-8కు..!
X

దిశ‌, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వే అద్భుతమే చేస్తోంది. రెండు, మూడు సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్లు కూడా చేయలేని సాహసాలు జింబాబ్వే ఒంటి చేత్తో చేసి సంచలనం సృష్టిస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026 లో ఒక్క ఓటమి లేకుండానే సూపర్ 8 లో అడుగుపెట్టి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది జింబాబ్వే. అంతేకాదు ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి బలమైన జట్లను గ్రూప్ స్టేజ్ లోనే ఓడించింది. దీంతో గ్రూప్ బీలో ఉన్న జింబాబ్వే, 7 పాయింట్లు సాధించి టేబుల్ లో టాప్ గా నిలిచింది. అలాగే సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఇక ఈ దశలో జింబాబ్వే పెద్దగా రాణించకపోయినా... వాళ్లు మాత్రం చరిత్రలో ఉండడం గ్యారంటీ అంటున్నారు.

ఆర్థిక సంక్షోభంలో జింబాబ్వే క్రికెట్ బోర్డు

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జింబాబ్వే క్రికెట్ బోర్డు, ఇప్పటికీ కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026 కంటే ముందు స్పాన్సర్లు కూడా ముందుకు రాలేదట. దీంతో క్రికెటర్లకు జీతాలు కూడా సరిగ్గా రాలేదని చెబుతున్నారు. అయినప్పటికీ కసితో ఆడిన జింబాబ్వే ప్లేయర్లు, ఇప్పుడు శభాష్ అనిపించుకుంటున్నారు. అంతేకాదు సూపర్ 8 లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా లాంటి జట్లను కూడా జింబాబ్వే వ‌ణికిస్తోంది. గ్రూప్ స్టేజ్ లోనే కంగారులతో పాటు శ్రీలంకను మట్టి కరిపించింది జింబాబ్వే. దీంతో ఇప్పుడు సూపర్ 8 దశలో కూడా జింబాబ్వే ఇరగదీస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి ఈ సూపర్ 8లో జింబాబ్వే ( Zimbabwe) ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిన జింబాబ్వే

టీ20 వరల్డ్ కప్ 2026 లో పసికూన జట్టుగా అడుగుపెట్టిన జింబాబ్వే, అంచనాలకు మించి రాణిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ స్టేజ్ లో 4 మ్యాచులు ఆడిన జింబాబ్వే, మొత్తం మూడింటిలో గెలిచింది. ఒకటి వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇలా ఏడు పాయింట్లు సాధించిన‌ జింబాబ్వే, సూపర్ 8 లో అడుగు పెట్టింది. అంతకు ముందు గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియా జట్టును 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ దెబ్బకు ఆస్ట్రేలియా కూడా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అటు తాజాగా శ్రీలంకను కూడా వాళ్ళ సొంత గ్రౌండ్ లోనే ఓడించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక పై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది జింబాబ్వే. ఇక ఇప్పుడు సూపర్ 8 లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి బలమైన టీమ్స్ తో తలపడనుంది. ఇది ఇలా ఉండ‌గా, టీ20 వరల్డ్ కప్ లో బాగంగా రేప‌టి నుంచే సూపర్ 8 దశ ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 26 వ తేదీన భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నుంది.

Next Story