డబ్ల్యూటీసీ 2025-27 ఫైనల్ ఆతిథ్యానికి భారత్ ఆసక్తి!

by Harish |

వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్‌‌కు ఆతిథ్యమివ్వడానికి భారత్ ఆసక్తి కనబరుస్తోంది.

డబ్ల్యూటీసీ 2025-27 ఫైనల్ ఆతిథ్యానికి భారత్ ఆసక్తి!
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్‌‌కు ఆతిథ్యమివ్వడానికి భారత్ ఆసక్తి కనబరుస్తోంది. గత రెండు ఎడిషన్ల ఫైనల్ మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌లోనే జరిగాయి. 2023-25 ఫైనల్‌ కూడా ఇంగ్లాండ్‌నే జరగబోతుంది. వచ్చే నెలలో ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో జరిగే టైటిల్ పోరులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి. అయితే, వచ్చే ఎడిషన్‌ ఫైనల్‌ 2027లో జరగనుండగా ఈ డబ్ల్యూటీసీ టైటిల్ పోరును ఇండియాలో నిర్వహించడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో జింబాబ్వేలో జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ మీటింగ్‌లో భారత్ తన ఆసక్తిని వెల్లడించినట్టు సమాచారం. అలాగే, ఫైనల్ వేదికను వేలం వేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీసీసీఐ తరపున చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా అరుణ్ సింగ్ ధుమాల్ హాజరయ్యారు. ఐసీసీ ఫైనల్ రైట్స్‌ను వేలం వేస్తే భారత్ ప్రధాన పోటీదారుగా ఉంటుంది. గత రెండుసార్లు ఫైనల్‌ను విజయవంతం చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి పోటీ ఉంటుంది. అయితే, వరల్డ్ క్లాస్ క్రికెటింగ్ మౌళిక సదుపాయాలు, భారీ ఫ్యాన్ బేస్, ఆర్థిక సామర్థ్యం వంటి పలు కారణాలు ఇండియాకు మద్దతు ఇస్తాయి. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌తో టీమిండియా డబ్ల్యూటీసీ 2025-27 సర్కిల్‌ను ప్రారంభించనుంది.


Next Story