వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ కార్లసన్.. మూడో స్థానంలో ఇరిగైశీ

by Phanindra |

వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా కార్లసన్ నిలిచాడు. టోర్నీని ఇరిగైశీ మూడో స్థానంలో ముగించాడు.

వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ కార్లసన్.. మూడో స్థానంలో ఇరిగైశీ
X

దిశ, స్పోర్ట్స్: ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ విజేతగా నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్లసన్ నిలిచాడు. మొత్తం 13 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 10.5 పాయింట్లు సాధించిన కార్లసన్ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. అంతకుముందు ఏడో రౌండ్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాదిస్లావ్ ఆర్టిమీవ్ చేతిలో ఓడిన కార్లసన్.. చికాకుగా కనిపించాడు. కెమెరామెన్‌ను పక్కకు తోసేశాడు. అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో చాలా ఫోకస్డ్‌గా కనిపించిన అతను.. చివరకు టైటిల్ విజేతగా నిలిచాడు. ఇది కార్లసన్‌కు ఆరో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌ టైటిల్ కావడం గమనార్హం. ఆర్టిమీవ్ (9.5 పాయింట్లు) రెండో స్థానంలో నిలవగా.. భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైశీ (9.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు. మరో భారత జీఎం వీఆర్ చిదంబరం అరవింద్ (8.5 పాయింట్లు) 16వ స్థానంలో నిలవగా.. సరిన్ నిహాల్ (8.5 పాయింట్లు) 19వ స్థానంలో, డి గూకేష్ (8.5 పాయింట్లు) 20వ స్థానంలో టోర్నీ ముగించారు.

మహిళల ఛాంపియన్ అలెగ్జాండ్రా..

మహిళల విభాగంలో రష్యన్ గ్రాండ్‌మాస్టర్ అలెగ్జాండ్రా గోర్యచికినా చివరి రౌండ్‌లో ఝూ జినర్‌ను ఓడించి తొలి వరల్డ్ ర్యాపిండ్ చాంపియన్‌షిప్ తన కైవసం చేసుకుంది. ఝూ రెండో స్థానంలో టోర్నీ ముగించగా.. భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వీరి ముగ్గురూ 8.5 పాయింట్లతో నిలవడంతో టై బ్రేకర్‌ ద్వారా విజేతను నిర్ణయించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా భారత్‌కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ బి. శ్రీసవిత (8 పాయింట్లు), గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలీ (8 పాయింట్లు) నిలిచారు. ఇదే టోర్నీలో బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ సోమవారం నుంచి మొదలవనుంది.

Next Story