- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారా అథ్లెట్ల హవా.. బంగారు పతకాలు గెలిచిన నిషాద్, సిమ్రాన్
భారత పారా అథ్లెట్లు సిమ్రాన్ శర్మ 100 మీటర్లు టీ12 ఈవెంట్‌లో, నిషాద్ కుమార్ హైజంప్ టీ47 ఈవెంట్‌లో వరల్డ్ చాంపియన్లుగా అవతరించారు.

దిశ, స్పోర్ట్స్ : భారత పారా అథ్లెట్లు సిమ్రాన్ శర్మ 100 మీటర్లు టీ12 ఈవెంట్‌లో, నిషాద్ కుమార్ హైజంప్ టీ47 ఈవెంట్‌లో వరల్డ్ చాంపియన్లుగా అవతరించారు. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వీరు తమ విభాగాల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. హైజంపర్ నిషాద్ 2.14 మీటర్ల ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. రెండుసార్లు పారాలింపిక్ సిల్వర్ మెడల్ అయిన నిషాద్‌కు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇదే తొలి గోల్డ్ మెడల్. అంతేకాకుండా, కొత్త ఆసియా రికార్డును కూడా నెలకొల్పాడు. స్ప్రింటర్ సిమ్రాన్ 100 మీటర్ల ఈవెంట్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 11.95 సెకన్లలో రేసును ముగించి భారత్ ఖాతాలో బంగారు పతకం చేర్చింది.
క్లబ్ త్రోయర్ ధరంబీర్ నైన్ క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో రజతం కైవసం చేసుకున్నాడు. 29.71 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. మరో భారత అథ్లెట్ ప్రణవ్ సూర్మ 28.19 మీటర్ల ప్రదర్శనతో 5వ స్థానంతో సరిపెట్లాడు. డిస్కస్ త్రో ఎఫ్57 ఈవెంట్‌లో భారత అథ్లెట్ అతుల్ కౌశిక్ కాంస్యం దక్కించుకున్నాడు. 29 ఏళ్ల కౌశిక్ పాల్గొన్న తొలి వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనే పతకం గెలవడం విశేషం. 10 మంది పాల్గొన్న ఫైనల్‌లో అతను 45.61 మీటర్ల ప్రదర్శన చేసి 3వ స్థానంలో నిలిచాడు. మరో డిస్కస్ త్రోయర్ పర్దీప్ కుమార్ ఎఫ్64 ఈవెంట్‌లో 46.23 మీటర్ల పర్ఫామెన్స్‌తో కాంస్యం గెలిచాడు. ఇక, మహిళల 200 మీటర్ల టీ35 ఈవెంట్‌లో ప్రీతి పాల్ 30.03 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్యం దక్కించుకుంది. దీంతో భారత్ పతకాల సంఖ్య 15కు చేరింది. అందులో ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.






