వారి వల్లే ఓడామంటే ఒప్పుకోను.. తొలి టెస్టులో ఓటమిపై గంభీర్ ఏమన్నాడంటే?

by Harish |

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.

వారి వల్లే ఓడామంటే ఒప్పుకోను.. తొలి టెస్టులో ఓటమిపై గంభీర్ ఏమన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓటమిపై స్పందించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జట్టుకు మద్దతుగా నిలిచాడు. ఓటమికి ఏ ఒక్కరినీ నిందించడం లేదని, జట్టుగా ఓడామని, జట్టుగానే గెలుస్తామని చెప్పాడు. ‘కొన్ని సమయాల్లో ఆటగాళ్లు విఫలమవుతారు. అది సహజం. ఈ ఓటమిని కచ్చితంగా నిరాశపరిచింది. అందరి కంటే ఎక్కువగా ప్లేయర్లు నిరాశపడి ఉంటారు. ఎందుకంటే, గెలిచే చాన్స్ ఉందని వాళ్లకు తెలుసు. తొలి ఇన్నింగ్స్‌లో మేము 570, 580 రన్స్ చేసి ఉంటే ఆధిపత్యం ప్రదర్శించేవాళ్లం.’ అని తెలిపాడు.

ఈ ఓటమికి టెయిలెండర్లు రాణించకపోవడం మాత్రమే కారణం కాదన్నాడు. కొన్ని సందర్భాల్లో పూర్తి బ్యాటర్లే విఫలమవుతున్నప్పుడు టెయిలెండర్లను నిందించనని చెప్పాడు. జట్టుగానే ఓడామని, జట్టుగానే గెలుస్తామని దీమా వ్యక్తం చేశాడు. ఈ పరాజయం నుంచి నేర్చుకోవాలన్నాడు. అలాగే, శార్దూల్ రెండు వికెట్లే తీయడంపై వచ్చిన ప్రశ్నకు గంభీర్ స్పందిస్తూ.. అతన్ని స్పెషలిస్ట్ బౌలర్‌గా తీసుకోలేదని, బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తీసుకున్నామని చెప్పాడు. అయినా అతను తీసిన ఆ రెండు వికెట్లు ఎంతో కీలకమైనవని తెలిపాడు.

గిల్ కెప్టెన్సీపై స్పందిస్తూ.. విజయవంతమైన సారథిగా ఎదగడానికి అతను అన్ని లక్షణాలు ఉన్నాయన్నాడు. ‘తొలి మ్యాచ్ సాధారణంగానే ఒత్తిడి ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఆడిన విధానం అద్భుతం. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం నిజంగా గొప్ప విషయం. అతనికి ఇవి ప్రారంభ రోజులు. మెరుగవ్వడానికి గిల్‌కు సమయం ఇవ్వాలి.’ అని గంభీర్ తెలిపాడు.

స్టార్ బౌలర్ బుమ్రా వర్క్‌లోడ్ గురించి మాట్లాడుతూ.. ముందుగా చెప్పినట్టే అతను ఈ టూరులో మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని మరోసారి స్పష్టం చేశాడు. మిగతా రెండు టెస్టులు ఏవో ఇంకా డిసైడ్ కాలేదన్నాడు. అలాగే, బౌలింగ్ దళానికి గంభీర్ మద్దతుగా నిలిచాడు. బుమ్రా, సిరాజ్ మినహా మిగతా వారికి పెద్దగా అనుభవం లేదని, వారికి సమయం ఇవ్వాలన్నాడు. ప్రతి టెస్టు తర్వాత బౌలర్లను జడ్జ్ చేస్తే బౌలింగ్ యూనిట్ ఎలా మెరుగువుతుందన్నాడు.


Next Story