Wimbledon 2025 : వింబుల్డన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన సిన్నర్, స్వైటెక్

by Harish |

వింబుల్డన్‌లో వరల్డ్ నం.1 ప్లేయర్ జెన్నిక్ సిన్నర్ హవా కొనసాగుతోంది.

Wimbledon 2025 : వింబుల్డన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన సిన్నర్, స్వైటెక్
X

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్‌లో వరల్డ్ నం.1 ప్లేయర్ జెన్నిక్ సిన్నర్ హవా కొనసాగుతోంది. ఎదురొచ్చిన వారినల్లా దాటుకుంటూ మెన్స్ సింగిల్స్ టైటిల్ దిశగా సాగుతున్నాడు. తాజాగా సెమీస్‌కు దూసుకెళ్లి టైటిల్ పోరుకు అడుగు దూరంలో నిలిచాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో సిన్నర్ 7-6(7-2), 6-4, 6-4 తేడాతో అమెరికాకు చెందిన షెల్టన్‌ను మట్టికరిపించాడు. ఇరువురి మధ్య రెండు 19 నిమిషాలపాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. షెల్టన్‌ గట్టి పోటీనే ఇవ్వడంతో సిన్నర్‌ శ్రమించాల్సి వచ్చింది. షెల్టన్ 14 ఏస్‌లు 29 విన్నర్లు బాది ఇబ్బంది పెట్టాడు. కానీ, ప్రత్యర్థి సవాల్‌ను సిన్నర తిప్పికొట్టాడు. సిన్నర్‌ 7 ఏస్‌లే కొట్టినప్పటికీ 33 విన్నర్లు బాదాడు. అలాగే, కీలక సమయాల్లో పట్టు బిగించాడు. దీంతో ఒత్తిడిలోకి వెళ్లిన షెల్టన్ 6 డబుల్ ఫౌల్ట్స్, 38 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో సిన్నర్ వరుసగా మూడు సెట్లలోనే మ్యాచ్ సొంతం చేసుకుని సెమీస్‌లో అడుగుపెట్టాడు. వింబుల్డన్‌లో సెమీస్‌కు చేరుకోవడం అతనికి ఇది రెండోసారి. గత మ్యాచ్‌లో సిన్నర్ మోచేతి గాయానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌కు కూడా దూరంగా ఉన్నాడు. గాయమైన ఒక్క రోజు వ్యవధిలోనే కోలుకుని షెల్టన్‌పై ఎలాంటి తడబాటుకు గురికాకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడం సాధారణ విషయం కాదు.

స్వైటెక్ తొలిసారి

ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్‌ తొలిసారిగా వింబుల్డన్‌లో సెమీస్‌లో అడుగుపెట్టింది. తొలిసారి చాంపియన్‌గా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న ఆమెకు టోర్నీలో ఎదురులేకుండా పోయింది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న స్వైటెక్ ఖాతాలో మరో అలవోక విజయం. క్వార్టర్ ఫైనల్‌లో స్వైటెక్ 6-2, 7-5 తేడాతో రష్యాకు చెందిన సామ్సోనోవాను చిత్తు చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆమె రెండు సెట్లలోనే విజేతగా నిలిచింది. మరోవైపు, అన్‌సీడ్ క్రీడాకారిణి, స్విట్జర్లాండ్‌కు చెందిన బెలిండా బెన్సిక్ కూడా సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఆమె వరల్డ్ నం.7 మిర్రా ఆండ్రీవాకు షాకిచ్చింది. హోరాహోరీగా సాగిన పోరులో బెన్సిక్ 7-6(7-3), 7-6(7-2) తేడాతో విజయం సాధించింది. రెండు సెట్ల ఫలితాలు టై బ్రేకర్‌లోనే తేలాయి. అంటే ఇద్దరి మధ్య పోరు ఎంత ఆసక్తికరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రెండు గంటలకుపైగా జరిగిన మ్యాచ్‌‌లో ఆండ్రీవా 4 డబుల్ ఫౌల్ట్స్, 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. వింబుల్డన్‌లో సెమీస్‌కు చేరడం బెన్సిక్‌కు ఇదే తొలిసారి. గురువారం జరిగే సెమీస్‌లో స్వైటెక్, బెన్సిక్ తలపడనున్నారు.

Next Story