Wimbledon 2025 : సబలెంకకు షాక్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన స్వైటెక్, అనిసిమోవా

by Harish |

వింబుల్డన్‌లో వరల్డ్ నం.1 టెన్నిస్ క్రీడాకారిణి సబలెంక‌కు షాక్ తగిలింది.

Wimbledon 2025 : సబలెంకకు షాక్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన స్వైటెక్, అనిసిమోవా
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ నం.1 టెన్నిస్ క్రీడాకారిణి సబలెంక‌కు షాక్. తొలి వింబుల్డన్ టైటిల్ వేటలో మరోసారి బోల్తాపడింది. అచ్చిరాని సెమీస్‌లోనే నిష్ర్కమించింది. టోర్నీ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన ఆమెకు గురువారం జరిగిన సెమీస్‌లో అమెరికా క్రీడాకారిణి అనిసిమోవా షాకిచ్చింది. అనిసిమోవా తొలిసారిగా ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరోవైపు టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ కూడా తొలిసారిగా వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీస్‌లో ఆమె బెలిండా బెన్సిక్(స్విట్జర్లాండ్)ను మట్టికరిపించింది. స్వైటెక్, అనిసిమోవ మధ్య శనివారం ఫైనల్ జరగనుంది. ఎవరూ గెలిచినా విబబుల్డన్‌లో ఉమెన్స్ సింగిల్స్‌కు కొత్త చాంపియన్ వచ్చినట్టే.

అనిసిమోవా తొలిసారిగా..

ముందుగా అనిసిమోవా, సబలెంక మధ్య సెమీస్ పోరు హోరాహోరీగా సాగింది. 2 గంటల 37 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో అనిసిమోవా 6-4, 4-6, 6-4 తేడాతో సబలెంకను చిత్తు చేసింది. సబలెంక గట్టిగా పోరాడింది. కానీ, అనిసిమోవా కచ్చితమైన షాట్లు ఆడింది. మరోవైపు, సబలెంక ఒత్తిడికి గురై పలు పొరపాట్లు చేసింది. తొలి రెండు సెట్లలో అనిసిమోవ, సబలెంక నెగ్గడంతో మ్యాచ్ ఫలితం నిర్ణయాత్మక మూడో సెట్‌లో తేలింది. అక్కడ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన అనిసిమోవా ఒక దశలో 4-1తో ఆధిక్యంలో నిలిచింది. సబలెంక పుంజుకున్నప్పటికీ ప్రత్యర్థి విజయాన్ని ఆపలేకపోయింది. సబలెంక 4 డబుల్ ఫౌల్ట్స్, 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. వింబుల్డన్‌లో సెమీస్‌లో ఓడటం సబలెంకు ఇది మూడోసారి. 23 ఏళ్ల అనిసిమోవా వింబుల్డన్‌లోనే కాదు ఓ గ్రాండ్‌స్లామ్‌లోనే టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అలాగే, వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన యంగెస్ట్ అమెరికా క్రీడాకారిణిగా నిలిచింది.

స్వైటెక్ ఏకపక్షంగా..

ఫ్రెంచ్ ఓపెన్ నాలుగుసార్లు, యూఎస్ ఓపెన్ ఓ సారి నెగ్గిన పొలాండ్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ ఇప్పటివరకు వింబుల్డన్ టైటిల్ నెగ్గలేదు. ఈ సారి వింబుల్డన్ చాంపియన్‌గా నిలవడానికి ఆమెకు కావాల్సింది ఒక్క విజయం మాత్రమే. ఆమె తొలిసారిగా వింబుల్డన్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. టోర్నీలో ఎదురులేకుండా దూసుకెళ్తున్న స్వైటెక్ సెమీస్‌లోనూ ఏకపక్ష విజయం సాధించింది. స్విట్జర్లాండ్ క్రీడాకారిణి బెన్సిక్‌పై 2-6, 0-6 తేడాతో గెలుపొందింది. కేవలం గంటా 12 నిమిషాల్లోనే మ్యాచ్‌ను కైవసం చేసుకుందంటే ఆమె ఆధిపత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 2 ఏస్‌లు, 26 విన్నర్లతో స్వైటెక్ దూకుడు కొనసాగించగా ప్రత్యర్థి ఏం చేయలేకపోయింది. పూర్తి చేతులెత్తేసి స్వైటెక్‌‌కు మ్యాచ్‌ను సమర్పించుకుంది.

Next Story