IND VS ENG : గిల్‌కు పరీక్ష.. ఇంగ్లాండ్ గడ్డపై కెప్టెన్‌గా ఆకట్టుకుంటాడా?

by Harish |

రోహిత్ శర్మ వారసుడిగా శుభ్‌‌మన్ గిల్ భారత టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే.

IND VS ENG : గిల్‌కు పరీక్ష.. ఇంగ్లాండ్ గడ్డపై కెప్టెన్‌గా ఆకట్టుకుంటాడా?
X

దిశ, స్పోర్ట్స్ : రోహిత్ శర్మ వారసుడిగా శుభ్‌‌మన్ గిల్ భారత టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. సారథిగా అతని ప్రయాణం నల్లేరు మీద నడకలా మాత్రం ఉండదు. మూడు ఫార్మాట్లలో అగ్ర జట్టుగా ఉన్న టీమిండియాను టెస్టుల్లో నడిపించడం అతనికి కత్తి మీద సామే. కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన ఆరంభంలోనే గిల్‌కు కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. రేపటి నుంచే ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. శుక్రవారం నుంచి తొలి టెస్టు మొదలవ్వనుంది. ఈ సుదీర్ఘ సిరీస్ సారథిగా అతన్ని పరీక్షించనుంది. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ కావడంతో ఒకరకంగా టెస్టుల్లో గిల్ శకం మొదలైనట్టే. గిల్‌ను కెప్టెన్‌‌గా ప్రకటించాక ఎన్నో విమర్శలు.. ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ‘విదేశాల్లో పెద్దగా ఆకట్టుకోని గిల్‌కు సారథ్యం ఇవ్వడమేంటి?.. అతనికి అనుభవం తక్కువ.. సీనియర్లను కెప్టెన్‌గా చేయాల్సింది’అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటికి ఇంగ్లాండ్ టూరులో గిల్ సమాధానం ఇవ్వాల్సి ఉంది.

కెప్టెన్‌గా రాణిస్తాడా?

రోహిత్ రిటైర్మెంట్‌ తర్వాత బుమ్రానే కెప్టెన్ అవుతాడని చాలా మంది భావించారు. కెప్టెన్సీని తానే తిరస్కరించినట్టు బుమ్రానే చెప్పాడు. అతని తర్వాత జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారు .కానీ, సెలెక్టర్లు మాత్రం గిల్ వైపు మొగ్గుచూపారు. బీసీసీఐ అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత మేరకు నిరూపించుకుంటాడో చూడాలి. ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్ అతనికి తొలి పరీక్ష. టెస్టుల్లో భారత్‌ను నడిపించడం గిల్‌కు ఇదేతొలిసారి. అయితే, టీ20 ఫార్మాట్‌లో గిల్‌కు కెప్టెన్సీ అనుభవం ఉంది. రోహిత్ గైర్హాజరీలో ఐదు టీ20లకు నాయకత్వం వహించాడు. అందులో నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. అలాగే, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో జీటీని ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. ఇంగ్లాండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, జట్టును నడిపించడం గిల్‌కు అంత సులభంగా ఉండకపోవచ్చు. రోజు రోజుకు పరిస్థితులు మారుతుంటాయి. డ్యూక్ బాల్స్ సవాల్ విసురుతాయి. అలాగే, బజ్‌బాల్ ఆటతో బెంబేలెత్తించే ఇంగ్లాండ్‌ను సొంతగడ్డపై నిలువరించడం కూడా అంత తేలిక కాదు. వీటికితోడు కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి సీనియర్లు లేకపోవడం కూడా లోటే. ఇన్ని ప్రతికూలంశాల మధ్య గిల్ టీమిండియాను ఎలా నడిపిస్తాడో చూడాలి.

సీనియర్లు లేని వేళ..

కోహ్లీ, రోహిత్ అందించిన వారసత్వాన్ని కొనసాగించడం గిల్‌కు కత్తి మీద సామే. ముఖ్యంగా విదేశాల్లో కోహ్లీ, రోహిత్ హయాంలో టెస్టుల్లో టీమిండియా గణనీయమైన వృద్ధి సాధించింది. అపురూప విజయాలు అందుకుంది. అదే దూకుడుతో భారత్‌ను నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు గిల్‌పై ఉంది. కాబట్టి, సాధారణంగానే గిల్‌పై ఒత్తిడి ఉంటుంది. దానికితోడు కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి సీనియర్లు లేకపోవడం ఎవరూ పూడ్చలేని లోటు. ఈ దిగ్గజ త్రయం లేకుండా భారత జట్టు‌కు ఇదే తొలి విదేశీ పర్యటన. ఈ ముగ్గురికి విదేశాల్లో అద్భుతమైన రికార్డు ఉంది. భారత్‌కు ఎన్నో సందర్భాల్లో విజయాలు అందించారు. ముఖ్యంగా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం గిల్‌కు అతి పెద్ద సవాల్‌‌గా మారింది. జట్టులో బుమ్రా, జడేజానే సీనియర్లు. ఒకరకంగా యువ జట్టుగా పరిగణించొచ్చు. యువకులతో కూడిన జట్టును గిల్ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరమే.

బ్యాటర్‌గా సవాలే

విదేశాల్లో గిల్ పర్ఫామెన్స్ అంతగా బాగా లేదు. 13 టెస్టుల్లో కేవలం 559 రన్సే చేశాడు. సగటు 25.40. ముఖ్యంగా ఇంగ్లాండ్ గడ్డపై గిల్ బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తున్నది. ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన అతను కేవలం 88 పరుగులే చేశాడు. కెప్టెన్సీ అప్పగించినప్పుడు ఈ గణాంకాలనే ప్రస్తావిస్తూ పలువురు విమర్శలు చేశారు. ఇప్పుడు అదనంగా గిల్‌పై కెప్టెన్సీ భారం కూడా ఉంది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అతనికి సవాల్ తప్పదు. కెప్టెన్సీ భారం అతనిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇటీవల ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌‌లో గిల్ హాఫ్ సెంచరీ చేయడం సానుకూల సంకేతమే.

దిగ్గజాల సరసన నిలుస్తాడా?

ఇంగ్లాండ్‌ గడ్డపై 1932 నుంచి భారత్ టెస్టులు ఆడుతోంది. అయితే, రెండు దశబ్దాలుగా టీమిండియా ఇంగ్లాండ్‌లో సిరీస్ విజయాలను చూడలేదు. ఈ నిరీక్షణకు తెరదించే బాధ్యత ఇప్పుడు గిల్‌పై పడింది. 2021లో కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఈ నిరీక్షణకు తెరదించేలా కనిపించినా చివరి వరకూ 2-2తో డ్రా అయ్యింది. ఇప్పటివరకు ముగ్గురు భారత కెప్టెన్లు మాత్రమే ఇంగ్లాండ్‌లో టీమిండియాకు సిరీస్ విజయాలు కట్టబెట్టారు. తొలిసారి 1971లో అజిత్ వాడేకర్ మూడు టెస్టుల సిరీస్‌‌లో 1-0తో గెలిపించాడు. ఆ తర్వాత 1986‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన టీమిండియా కపిల్ దేవ్ నేతృత్వంలో 2-0తో సిరీస్ సాధించింది. ఇక, చివరిసారిగా ఇంగ్లాండ్ గడ్డపై రాహుల్ ద్రవిడ్ జట్టుకు అపురూ విజయాన్ని అందించాడు. 2007లో భారత్ 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అనంతరం భారత జట్టు మరో సిరీస్ విజయాన్ని సాధించలేదు. మరి, ఇప్పుడు గిల్ సిరీస్ విజయాన్ని అందించి దిగ్గజాల సరసన నిలుస్తాడో లేదో చూడాలి.

Next Story