ఆపరేషన్‌ సిందూర్.. ఐపీఎల్‌ షెడ్యూల్‌పై ఏమైనా ప్రభావం చూపనుందా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-07 10:06:53  IST  )

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.

ఆపరేషన్‌ సిందూర్.. ఐపీఎల్‌ షెడ్యూల్‌పై ఏమైనా ప్రభావం చూపనుందా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ (IPL) సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో ఇంకా 18 మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టార్ ఆటగాళ్ళు IPL 2025లో ఆడుతున్నారు. ప్రస్తుతం టోర్నమెంట్ ప్లేఆఫ్స్ కోసం పోటీ కొనసాగుతోంది. మే 25 ఫైనల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ఐపీఎల్‌పై ప్రభావం పడుతుందా? విదేశీ ప్లేయర్లను తమ దేశాలు వెనక్కి పిలిపించుకుంటాయా? అనే అనుమానం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలుస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. అయితే, దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై BCCI, ఐపీఎల్ నిర్వాహకులు కూడా నిశితంగా దృష్టి సారిస్తున్నారు. పరిస్థితిని అంచనా వేసి, అవసరమైతే ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. అలాగే, కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయడం వల్ల క్రికెటర్లకు ప్రయాణ సవాళ్లు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ధర్మశాల ఎయిర్‌పోర్టు మూసివేయటంతో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఎందుకంటే ధర్మశాల వేదికగా మే 11న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను మరో ప్రాంతానికి మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్టేడియం దగ్గర భద్రతా చర్యలు మరింత కఠినం చేయనుంది బీసీసీఐ. ఇక స్టేడియంలో మ్యాచులకు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

Next Story