కష్టాలను దాటి.. అవమానాలను ఓర్చి.. చాంపియన్లను తీర్చిదిద్దిన కోచ్

by Ajay Maddhiboyina |

భారత హాకీ మహిళా జట్టుకు ఒకప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రీతమ్ రాణి సివాచ్.. హాకీ ప్లేయర్‌గా ఎదగడానికి ఎంతో కష్టపడ్డారు.

కష్టాలను దాటి.. అవమానాలను ఓర్చి.. చాంపియన్లను తీర్చిదిద్దిన కోచ్
X

- హాకీ ఇండియా లీగ్‌లో విజేతల వెనుక ప్రీతమ్

- మెరికల్లాటి ఆటగాళ్లను తయారు చేసిన మాజీ కెప్టెన్

- పానిపట్‌లో సొంత భూమిలో హాకీ అకాడమీ

- 21 ఏళ్ల కల సాకారం

దిశ, స్పోర్ట్స్:

మన దేశంలో క్రికెట్ తప్ప వేరే ఆటకు పెద్దగా ఆదరణ ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తే తప్ప.. వాళ్లు మామూలు సమయంలో ఎవరికీ గుర్తుకు రారు. హాకీ మన జాతీయ క్రీడ అయినా అందులో ప్రొఫెషనల్స్‌గా ఎదిగే క్రీడాకారులు చాలా తక్కువ. ఇక ఆడపిల్లలు అయితే హాకీని ఎంచుకుంటే అందరూ వింతగా చూస్తారు. భారత హాకీ మహిళా జట్టుకు ఒకప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రీతమ్ రాణి సివాచ్.. హాకీ ప్లేయర్‌గా ఎదగడానికి ఎంతో కష్టపడ్డారు. ఆమెకు అసలు ఆ ఆట ఎలా నేర్చుకోవాలి.. ఎవరి వద్ద కోచింగ్ తీసుకోవాలనే అవగాహన కూడా లేదు. తన 9వ ఏట హాకీ ఆడటం ప్రారంభించినా సరైన కోచ్ దొరకడం కష్టంగా మారింది. అయినా సరే మొక్కవోని దీక్షతో హాకీలో రాణించడమే కాకుండా.. ఇండియా జట్టుకు కెప్టెన్ అయ్యింది. కామన్వెన్త్ గేమ్స్‌లో గోల్డ్, ఏసియన్ గేమ్స్‌లో రెండు సార్లు సిల్వర్ సాధించింది. అయితే ఆట నుంచి రిటైర్ అయ్యాక.. తనలా హాకీ ప్లేయర్లు కావాలనుకునే పేద పిల్లలు కష్టాలు పడకూడదని ఏకంగా హాకీ అకాడమీని ప్రారంభించారు.

అవహేళన చేసిన చోటే..

హాకీలో మెరికెల్లాటి మహిళా ప్లేయర్లను తయారు చేయాలని ప్రీతమ్ రాణి సివాచ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. హర్యానాలోని సోనేపట్‌లో ఉన్న ఒక బీడు భూమిలో ప్రీతమ్ అకాడమీ ఏర్పాటు చేయాలని భావించారు. ఇదే విషయం తన భర్త, మాజీ హకీ ప్లేయర్ కుల్దీప్ సివాచ్‌కు చెప్పారు. కానీ ఆయన ఆ భూమిని హాకీ అకాడమీ కోసం ఉపయోగించడానికి మొదట్లో ఒప్పుకోలేదు. అయితే హాకీ కోచింగ్ పట్ల ప్రీతమ్‌కు ఉన్న ఆసక్తిని చూసి కుల్దీప్ చివరకు ఒప్పుకోక తప్పలేదు. ఆ వెంటనే ఎన్నో కష్టాలకు ఓర్చి ఒక అద్బుతమైన అకాడమీని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ అమ్మాయిలకు హాకీ కోచింగ్ ఇస్తానంటే ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. పైగా అమ్మాయిల తల్లిదండ్రులు అవహేళన చేసేవారు. అమ్మాయిలు హాకీ ఆడి ఏం సాధిస్తారు.. అంటూ ముఖం మీదే చెప్పేవారు. అయినా సరే ప్రీతమ్ కుంగిపోలేదు. సమీపంలోని గ్రామాల్లోని ఆడపిల్లలను పిలిచి ఆటను చూడమని చెప్పేవారు. తాను, తన భర్త, ఇద్దరు పిల్లలు కలిసి ఆడుతుంటే.. మిగిలిన అమ్మాయిలు చూసేవారు. క్రమంగా ఆ పిల్లల్లో ఆటపట్ల ఆసక్తి పెరిగిన తర్వాత వారికి బేసిక్స్ నేర్పించారు. ప్రీతమ్ హాకీ అకాడమీలో బేసిక్స్ నేర్చుకున్న వారి నుంచి టాలెంట్ ఉన్న అమ్మాయిలకు సీరియస్‌గా కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా రెండు దశాబ్దాల కాలంలో ఎంతో మందిని హాకీ ప్లేయర్లుగా మార్చారు.

ఫైనల్లో తన అకాడమీ ఆటగాళ్లే..

హాకీ ఇండియా మహిళల కోసం ఈ ఏడాది తొలి సారిగా ఇండియన్ హాకీ లీగ్‌ను ప్రారంభించింది. రాంచీలోని గోమ్కే జైపాల్ సింగ్ ముండా ఆస్ట్రో టర్ఫ్ హాకీ స్డేడియంలో ఆదివారం సూర్మా హాకీ క్లబ్, ఒడిషా వారియర్స్ మధ్య ఫైనల్ జరిగింది. అయితే ఈ రెండు జట్లలో ప్రీతమ్ రాణి కోచింగ్ ఇచ్చిన ఆటగాళ్లు ఉన్నారు. ఒడిషా వారియర్స్‌లో నేహ, నిష, సాక్షి, కనిక.. సూర్మా హాకీ క్లబ్‌లో జ్యోతి, షర్మిలలు ప్రీతమ్ రాణి అకాడమీ విద్యార్థులే. రెండు జట్లలో రిజర్వ్ ప్లేయర్లుగా మరో ఇద్దరు ఉన్నారు. మరోవైపు హాకీ ఇండియా లీగ్‌లో బెంగాల్ టైగర్స్ తరపున శిల్పి దబాస్, మహిమా చౌదరి, ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టులో మనిషాలు కూడా ప్రీతమ్ అకాడమీకి చెందిన వారే. ఇలా హాకీ ఇండియా లీగ్‌లో ఏకంగా 12 మంది క్రీడాకారులు ప్రీతమ్ రాణి అకాడమీకి చెందిన వారే కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అయితే ఫైనల్‌లో రెండు వేర్వురు జట్లలో తన విద్యార్థులు ఉండటంతో ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాలేదని ప్రీతమ్ చెప్పుకొచ్చారు. తొలి మహిళా హాకీ ఇండియా లీగ్‌ను గెలిచిన ఒడిషా వారియర్ జట్టు కెప్టెన్ నేహా గోయల్ గురించి ప్రీతమ్ ప్రత్యేకంగా చెప్పారు. పానిపట్‌లో తాను కోచింగ్ ప్రారంభించినప్పుడు.. ఆ అకాడమీ దగ్గరకు చింపిరి జుట్టు, చినిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చి గేటును పట్టుకొని వేలాడుతుండేది. మొదట్లో పిలిస్తే కూడా వచ్చేది కాదు. కానీ తర్వాత ఆట పట్ల ఆసక్తి పెరిగి.. అందులో నిష్ణాతురాలైందిని అన్నారు. తన కూతురు కనిక కూడా తన వద్దే కోచింగ్ తీసుకొని హాకీ ఇండియా లీగ్‌లో ఆడటం మరో అనుభూతి అని చెప్పారు. మొత్తానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి.. తాను తీర్చిదిద్దిన క్రీడాకారులు 12 మంది ఒకే లీగ్‌లో స్థానం సంపాదించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది హాకీ క్రీడాకారులను తీర్చిదిద్దుతానని ప్రీతమ్ రాణి సివాచ్ చెబుతున్నారు. భర్త కుల్దీప్ ప్రోత్సాహం వల్లే ఇంతటి క్రీడాకారులను తయారు చేస్తున్నానని ఆమె చెప్పారు.

Next Story