- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాయి హోప్ సూపర్ సెంచరీ వృధా.. విండీస్‌పై కివీస్ థ్రిల్లింగ్ విక్టరీ
వెస్టిండీస్ కెప్టెన్ షాయి హోప్ సూపర్ సెంచరీ వృధా అయింది. రెండో వన్డేలో విండీస్‌పై కివీస్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.

దిశ, స్పోర్ట్స్: వెస్టిండీస్ కెప్టెన్ షాయి హోప్ (109 నాటౌట్) అద్భుతమైన శతకంతో చెలరేగినా జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు. న్యూజిల్యాండ్‌తో నేపియర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కరీబియన్ జట్టు ఓటమి చవిచూసింది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచులో.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. బ్యాటర్లు ఒక్కొక్కరే పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఒకానొక దశలో 86/5తో ఆ టీం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో కంట్రోల్డ్ ఎగ్రెషన్ చూపించిన హోప్.. 42 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయిన అతను 66 బంతుల్లోనే శతకం పూర్తిచేశాడు.
అతని పోరాటంతో వెస్టిండీస్ 247/9 పరుగుల స్కోరు సాధించింది. ఛేజింగ్‌లో కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (90), రచిన్ రవీంద్ర (56) ఆ టీంకు అదిరే ఆరంభం అందించారు. అయితే ఆ తర్వాత వచ్చిన యంగ్ (11), చాప్‌మన్ (0), బ్రేస్‌వెల్ (11) ఫెయిలవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఇలాంటి సమయంలో టామ్ లాథమ్ (39 నాటౌట్)కు జతకలిసిన కివీస్ సారధి మిచెల్ శాంట్నర్ (34 నాటౌట్) చెలరేగాడు. రెండు సిక్సులు, 3 ఫోర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి, మరో మూడు బంతులు మిగిలుండగానే న్యూజిల్యాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.
లారా రికార్డు సమం:
షాయి హోప్‌కు వన్డేల్లో ఇది 19వ అంతర్జాతీయ సెంచరీ. దీంతో వెస్టిండీస్ తరఫున అత్యధిక వన్డే శతకాలు చేసిన బ్యాటర్‌గా లెజెండ్ బ్రయాన్ లారా రికార్డును హోప్ సమం చేశాడు. ఈ జాబితాలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 25 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.






