ఐపీఎల్-2026పై వార్ ఎఫెక్ట్.. సకాలంలో ఆ ప్లేయర్లు వస్తారా?

by Harish |

ఐపీఎల్-2026పై వార్ ఎఫెక్ట్.. సకాలంలో ఆ ప్లేయర్లు వస్తారా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026కు సంబంధించిన తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. ఇంకా 15 రోజులే సమయమే మాత్రమే ఉండగా ఫ్రాంచైజీలను ఓ విషయం టెన్షన్ పెడుతోంది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ఐపీఎల్-2026పై ఎఫెక్ట్ చూపించనుంది. వార్ కారణంగా పశ్చిమాసియాలో పరిస్థితులు బాగా లేవు. దీంతో గల్ఫ్ ప్రాంతాల్లో ప్రయాణ ఆంక్షలు ఉన్నాయి. దుబాయ్, దోహా గగనతలాలపై పరిమితులు విధించారు. దీంతో విదేశీ ప్లేయర్లు ముఖ్యంగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం భారత్‌కు సకాలంలో వస్తారా? అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ రాలేకపోతే ఆయా ఫ్రాంచైజీలకు భారీ దెబ్బే.

టీ20 వరల్డ్ కప్‌ కోసం భారత్‌కు వచ్చిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి. ఆ జట్లు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లడానికి వారంపాటు వేచిచూడాల్సి వచ్చింది. అయితే, ఐసీసీ బుధ, గురువారాల్లో వారి ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. మొన్నటి వరకు టీ20 ప్రపంచకప్ ఆడిన ఈ జట్ల ప్లేయర్లు కేవలం రెండు వారాల వ్యవధిలో ఐపీఎల్ ఆడటానికి సిద్ధమేనా? అంటే చెప్పలేని పరిస్థితి. దానికితోడు విమాన సర్వీస్‌ల సమస్య కూడా. విమాన ప్రయాణాలు ఆ దేశాల ప్లేయర్లపై ప్రభావం చూపించొచ్చని కథనాలు పేర్కొన్నాయి. దుబాయ్, దోహా విమానాశ్రయాల్లో ఫ్లైట్ సర్వీస్‌లు రద్దు, ఆలస్యం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆ దేశాల ప్లేయర్లు ఐపీఎల్ తొలి దశకు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. ‘వెస్టిండీస్, సౌతాఫ్రికా ప్లేయర్లు భారత్ నుంచి వెళ్లడం చాలా ఆలస్యమైంది. కాబట్టి వారిని సకాలంలో భారత్‌కు తిరిగి రప్పించడం కష్టంతో కూడుకున్నది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమాన చార్జీలు కూడా భారీగా పెరిగాయి.’అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

విండీస్, సౌతాఫ్రికా నుంచి 20 మంది ప్లేయర్లు

ఐపీఎల్-2026లో విండీస్, సౌతాఫ్రికాల నుంచి 20 మంది ప్లేయర్లు ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విండీస్ నుంచి నికోలస్ పూరన్(లక్నో), సునీల్ నరైన్(కేకేఆర్), పొవెల్(కేకేఆర్), అకేల్ హుస్సేన్(సీఎస్కే), హెట్మేయర్(రాజస్థాన్), రొమారియో షెఫర్డ్(ఆర్సీబీ), రూథర్‌ఫొర్డ్(ముంబై), జాసన్ హోల్డర్(గుజరాత్) ఉన్నారు. అలాగే, సౌతాఫ్రికా నుంచి ఢిల్లీ టీమ్‌లో ట్రిస్టన్ స్టబ్స్, లుంగి ఎంగిడి, డోనోవన్ ఫెరీరా, ముంబై జట్టులో డికాక్, రికెల్టన్, కార్బిన్ బోష్, రాజస్థాన్ జట్టులో నాండ్రే బర్గర్, క్వెనా మఫాకా ఉన్నారు. డెవాల్డ్ బ్రెవిస్(సీఎస్కే), రబాడ(గుజరాత్), మార్‌క్రమ్(లక్నో), జాన్సెన్(పంజాబ్) కూడా ఆడనున్నారు. వీరందరూ ఆయా జట్లలో కీలకంగా మారే చాన్స్ ఉంది. కొందరిని పలు జట్లు భారీ ధరకు కొనుగోలు లేదా రిటైన్ చేసుకున్నాయి. సకాలంలో వీరు ఐపీఎల్‌కు అందుబాటులోకి రాకపోతే ఆయా జట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే, చెన్నయ్ సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం సౌతాఫ్రికా బ్యాటర్ బ్రెవిస్, వెస్టిండీప్ ప్లేయర్ అకేల్ హుస్సేన్ తొలి మ్యాచ్‌కు ముందే జట్టుతో కలుస్తారని దీమా వ్యక్తం చేశారు.

Next Story