సచిన్ ఇంట పెళ్లి సందడి.. ప్రధాని మోడీ, రాహుల్‌ గాంధీకి ఆహ్వానం

by Ramesh Naini |

సచిన్ ఇంట పెళ్లి సందడి.. ప్రధాని మోడీ, రాహుల్‌ గాంధీకి ఆహ్వానం
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఈ మేరకు సచిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ప్రధానిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సచిన్ పంచుకున్నారు. ‘ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అర్జున్ - సానియా వివాహానికి ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవం. నూతన వధూవరులకు మీరు అందించిన ఆశీస్సులు, విలువైన సలహాలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ప్రధానితో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా సచిన్ తన కుటుంబంతో కలిసి కలిసి వివాహానికి ఆహ్వానించారు.

మార్చి 3 నుంచి వేడుకలు..

అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల వివాహ వేడుకలు ఈ ఏడాది మార్చి 3న ప్రారంభమై, మార్చి 5న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా జరగనున్నాయి. గత ఏడాది ఆగస్టులో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

ఎవరీ సానియా చందోక్?

ముంబైలోని అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటైన ఘాయ్ కుటుంబానికి చెందిన సానియా చందోక్, ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఆమె ప్రస్తుతం 'మిస్టర్ పాస్ పెట్ స్పా & స్టోర్' (Mr. Paws Pet Spa & Store LLP) సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వీరి కుటుంబానికి హాస్పిటాలిటీ రంగంలో మంచి పట్టు ఉంది. ప్రసిద్ధ 'ఇంటర్‌ కాంటినెంటల్' హోటల్, 'బ్రూక్లిన్ క్రీమరీ' ఐస్‌క్రీమ్ బ్రాండ్ వీరి యాజమాన్యంలోనే ఉన్నాయి.

Next Story