అందరి కళ్లు.. కోహ్లీ పైనే

by Ajay Maddhiboyina |

విరాట్ కోహ్లీ మరో సారి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ ఆడబోతున్నారు. మోడ్రన్ డే మాసర్ట్‌గా పేరున్న కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు.

అందరి కళ్లు.. కోహ్లీ పైనే
X

- ఫైనల్‌లో విరాట్ మెరుస్తాడా?

- ఐసీసీ టోర్నీల్లో కోహ్లీ రికార్డు ఎలా ఉంది?

దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. ఇండియా, న్యూజీలాండ్ జట్లు ఆదివారం (మార్చి 9) దుబాయ్ వేదికగా ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఫైనల్ బెర్త్ సాధించడానికి అర్హత కలిగినవే. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టిగా రాణిస్తూ తుది పోరుకు చేరుకున్నాయి. బౌలింగ్‌లో భారత జట్టు ఊహించిన దాని కంటే ఎక్కువగానే రాణిస్తోంది. బుమ్రా లేకపోయినా.. భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కూడా ప్రత్యర్తి జట్లను ఆలైట్ చేసింది. మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి జట్టుకు కీలక సమయాల్లో బ్రేక్ త్రూలను అందిస్తున్నారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టాపార్డర్‌లో రోహిత్ వరుసగా విఫలమవుతుండటం ఆందోళనకరంగా ఉంది. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ నిలకడగా రాణిస్తున్నారు. అయితే ఫైనల్‌లో భారత జట్టు భారాన్ని ఎక్కువగా మోసే బాధ్యత విరాట్ కోహ్లీ పైనే ఉంది. భారత అభిమానులే కాకుండా.. కివీస్ అభిమానులు కూడా కోహ్లీపై ఒక కన్నేసి ఉంచారు. కోహ్లీ రాణిస్తేనే భారత జట్టు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

ఛేజింగ్ కింగ్..

విరాట్ కోహ్లీ మరో సారి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ ఆడబోతున్నారు. మోడ్రన్ డే మాసర్ట్‌గా పేరున్న కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ అతని ఖాతాలో ఉన్నాయి. అయితే రెండో సారి చాంపియన్స్ ట్రోఫీ సాధించాలని కోహ్లీ కూడా ఊవ్వీళ్లూరుతున్నాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఛేజ్ చేసిన కోహ్లీ.. న్యూజీలాండ్ మ్యాచ్‌కు సన్నద్దం అవుతున్నాడు. ఇటీవల న్యూజీలాండ్ సిరీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఇక 2000లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో భారత్‌ను ఓడించిన న్యూజీలాండ్ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే భారమంతా విరాట్ కోహ్లీపైనే ఉంది. ఐసీసీ ఫైనల్స్‌లో కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. దీంతో ఈ సారి కూడా ఆ రికార్డును కొనసాగిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

కోహ్లీ రికార్డులు..

మేజర్ టోర్నీలు, ఫైనల్స్ వంటి మ్యాచ్‌లలో కోహ్లీకి ఉన్న రికార్డు మరి ఏ ఇతర క్రికెటర్‌కు లేదు. అనేక సందర్భాల్లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మూల స్తంభంలా నిలబడి పోరాడాడు. ముఖ్యంగా ఛేజింగ్‌లో కోహ్లీ రికార్డులు అనన్య సామాన్యమైనవి. ఐసీసీ ఫైనల్స్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 41.0 సగటుతో 410 పరుగులు చేశాడు. కోహ్లీ మొత్తంగా 9 ఐసీసీ ఫైనల్స్ ఆడగా.. మొదటి రెండు సార్లు భారత జట్టు విజయాలు నమోదు చేసింది. కోహ్లీ తొలి సారి 2011లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడాడు. ఇక ఆ తర్వాత 2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కూడా ఆడాడు. ఈ రెండు ఫైనల్స్‌లో భారత జట్టు విజయం సాధించి.. చాంపియన్లుగా నిలిచింది. 2014 టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై 77 పరుగులు చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింి. 2021, 2023 టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో కోహ్లీ ఆడాడు. రెండు సార్లు భారత్ గెలవలేకపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 54 పరుగులు చేశాడు. కానీ అప్పుడు కూడా భారత్‌కు లక్కు లేకుండా పోయింది. ఇక 2024 టీ20 వరల్డ్ కప్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఐసీసీ ఫైనల్స్‌ రికార్డులు పరిశీలిస్తే.. కోహ్లీ రాణిస్తే ఆ మ్యాచ్ తప్పకుండా భారత్ గెలుస్తుంది. కాబట్టి ఈ సారి కూడా కోహ్లీ ఒక హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడాలని భారత జట్టు అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.

కోహ్లీ ఆడిన వైట్ బాల్ ఐసీసీ ఫైనల్స్ గణాంకాలు:

మ్యాచ్‌లు : 6

ఇన్నింగ్స్ : 6

పరుగులు : 290

అత్యధిక పరుగులు : 77

సగటు : 48.33

స్ట్రైక్ రేట్ : 106.61

హాఫ్ సెంచరీలు : 3

Next Story