విజయ్ హజారే ట్రోఫీ: సెమీస్‌కు దూసుకెళ్లిన సౌరాష్ట్ర, కర్ణాటక

by Ramesh Naini |

విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో వరుణుడు కీలక పాత్ర పోషించాడు. సోమవారం జరిగిన రెండు వేర్వేరు మ్యాచ్‌లలో వర్షం అంతరాయం కలిగించడంతో, వీజేడీ (VJD) పద్ధతి ఆధారంగా సౌరాష్ట్ర, కర్ణాటక జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.

విజయ్ హజారే ట్రోఫీ: సెమీస్‌కు దూసుకెళ్లిన సౌరాష్ట్ర, కర్ణాటక
X

దిశ, డైనమిక్ బ్యూరో: విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో వరుణుడు కీలక పాత్ర పోషించాడు. సోమవారం జరిగిన రెండు వేర్వేరు మ్యాచ్‌లలో వర్షం అంతరాయం కలిగించడంతో, వీజేడీ (VJD) పద్ధతి ఆధారంగా సౌరాష్ట్ర, కర్ణాటక జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ముంబై, ఉత్తర ప్రదేశ్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సౌరాష్ట్ర ముందంజ

బలమైన ఉత్తర ప్రదేశ్ (యూపీ) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ హార్విక్ దేశాయ్ అజేయ సెంచరీతో జట్టును సెమీస్‌కు చేర్చాడు. రిషబ్ పంత్ గాయం కారణంగా వికెట్ కీపర్ ధృవ్ జురెల్ టీమిండియాకు ఎంపికవడంతో, అతను లేకుండానే యూపీ బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి సౌరాష్ట్ర విజయ సమీకరణం మెరుగ్గా ఉండటంతో, వీజేడీ పద్ధతి ప్రకారం 17 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు.

ముంబయిపై కర్ణాటక ఘన విజయం

మరో క్వార్టర్ ఫైనల్ పోరులో కర్ణాటక బ్యాటర్లు ముంబయి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ముంబయి నిర్దేశించిన 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కర్ణాటక ధాటిగా ఆడింది. దేవదత్ పడిక్కల్ (81 నాటౌట్), కరుణ్ నాయర్ (74 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయారు. వర్షం, వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి కర్ణాటక ఒక వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. వీజేడీ పద్ధతి ప్రకారం అప్పటికి ఉండాల్సిన పార్ స్కోరు 132 పరుగులు కాగా, కర్ణాటక ఏకంగా 55 పరుగులు ముందంజలో ఉంది. దీంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు.

Next Story