- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Hazare Trophy : చరిత్ర సృష్టించిన విదర్భ.. విజయ్ హజారే ట్రోఫీ కైవసం
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ 'విజయ్ హజారే ట్రోఫీ'లో కొత్త విజేత ఆవిర్భవించింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సౌరాష్ట్రను మట్టికరిపించిన విదర్భ జట్టు మొట్టమొదటి సారి ఛాంపియన్‌గా నిలిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ 'విజయ్ హజారే ట్రోఫీ'లో కొత్త విజేత ఆవిర్భవించింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సౌరాష్ట్రను మట్టికరిపించిన విదర్భ జట్టు మొట్టమొదటి సారి ఛాంపియన్‌గా నిలిచింది. ఓపెనర్ అథర్వ తైడే అద్భుత శతకంతో కదం తొక్కడంతో విదర్భ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అథర్వ తైడే 'సెంచరీ'
టాస్ గెలిచిన సౌరాష్ట్ర ముందుగా విదర్భను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. విదర్భ ఓపెనర్లు అథర్వ తైడే, అమన్ మొఖాడే ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 80 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు (814) చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన అమన్ మొఖాడే నిష్క్రమించినా, తైడే తన జోరును కొనసాగించాడు. అథర్వ తైడే కేవలం 97 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 సిక్సర్లతో క్లాసీ సెంచరీ పూర్తి చేశాడు. మరో బ్యాటర్ యష్ రాథోడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించి స్కోరును 213 పరుగులకు చేర్చాడు. అయితే, తైడే అవుటయ్యాక విదర్భ వరుస వికెట్లు కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బౌలర్లలో అంకుర్ పన్వార్ 4 వికెట్లతో రాణించాడు.
చేతులెత్తేసిన సౌరాష్ట్ర బ్యాటర్లు
318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్రకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్ ప్లేలోనే కీలక బ్యాటర్లు హార్విక్ దేశాయ్, విశ్వరాజ్‌సింగ్ జడేజా అవుట్ కావడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఆ వెంటనే సమ్మర్ గజ్జర్ కూడా పెవిలియన్ చేరడంతో రన్ రేట్ పెరిగి ఒత్తిడి ఎక్కువైంది. మిడిలార్డర్‌లో ప్రేరక్ మన్కడ్, చిరాగ్ జాని పోరాడినప్పటికీ, విదర్భ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సౌరాష్ట్ర 279 పరుగులకే ఆలౌట్ అయింది.






