- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US Open : సంచలనం సృష్టించిన యుకీ బాంబ్రీ.. యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన భారత టెన్నిస్ స్టార్
యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లో భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ చరిత్ర సృష్టించే దిశగా సాగుతున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లో భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ చరిత్ర సృష్టించే దిశగా సాగుతున్నాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన అతను న్యూజిలాండ్ ఆటగాడు మైఖేల్ వీనస్‌తో కలిసి అదరగొడుతున్నాడు. పురుషుల డబుల్స్‌లో ఈ జోడీ తమ కంటే మెరుగైన ర్యాంకర్లను ఓడిస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో యుకీ-వీనస్ జంట 6-3, 6-7(6-8), 6-3 తేడాతో 11వ సీడ్ నికోలా మెక్టిక్(క్రోయేషియా)-రాజీవ్ రామ్(అమెరికా) జోడీపై విజయం సాధించింది. 2 గంటల 37 నిమిషాలపాటు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్ నెగ్గి యుకీ జోడీ శుభారంభం చేసినప్పటికీ రెండో సెట్‌లో మాత్రం తీవ్రంగా శ్రమించిన ఫలితం దక్కలేదు. ప్రత్యర్థులు టై బ్రేకర్‌లో రెండో సెట్‌ను నెగ్గి స్కోర్లను సమం చేశారు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో సెట్‌కు వెళ్లగా అక్కడ మాత్రం యూకీ,వీనస్ సత్తాచాటడంతో మ్యాచ్ సొంతమైంది. యుకీ జోడీ విన్నర్ల(60)తో విరుచుకుపడి ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించింది. యుకీ తన కెరీర్‌లో ఓ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. సెమీస్‌లో యుకీ, వీనస్ యూకేకు చెందిన నీల్ స్కుప్సీ-జో సాలిస్‌బరీ ద్వయంతో తలపడనుంది.
స్వైటెక్‌కు షాక్
ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌లో ఈ పొలాండ్ క్రీడాకారిణి ఇంటిదారిపట్టింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆమెకు అమెరికా క్రీడాకారిణి అనిసిమోవా షాకిచ్చింది. వరుసగా రెండు సెట్లను 6-4, 6-3తో గెలిచి సెమీస్‌కు చేరుకుంది. స్వైటెక్‌పై పెద్దగా కష్టపడకుండానే గెలిచింది. కేవలం గంటా 36 నిమిషాల్లోనే విజయతీరాలకు చేరింది. స్వైటెక్ 3 డబుల్ ఫౌల్ట్స్, 15 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తన కంటే తక్కువ ర్యాంక్ కలిగిన అనిసిమోవాను నిలువరించలేకపోయింది. స్వైటెక్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ విజేతగా నిలిచింది. మరోవైపు, జపాన్ స్టార్ నవోమి ఒసాకా కూడా సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె4-6, 6-7(3-7) తేడాతో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాపై విజయం సాధించింది. కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత ఒసాకా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.
ఎదురులేని సిన్నర్
డిఫెండింగ్ చాంపియన్ సిన్నర్(ఇటలీ)కు ఎదురులేకుండా పోయింది. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచే దిశగా దూసుకెళ్తున్న అతను సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్‌లో ఈ ఇటలీ ప్లేయర్ తన సహచరుడు లొరెంజో ముసెట్టిని ఓడించాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ను 6-1, 6-4, 6-2 తేడాతో గెలిచాడు. కేవలం రెండు గంటల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. 10 ఏస్‌లు, 28 విన్నర్లు బాదిన అతను ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ముసెట్టి ఒక్క బ్రేక్ పాయింట్ కూడా సాధించలేదు. అలాగే, 22 అనవసర తప్పిదాలతో ఓటమి కొనితెచ్చుకున్నాడు.






