Badminton : సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత్.. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై విజయఢంకా

by Harish |   (  Updated:2026-04-26 16:11:45  IST  )

Badminton : సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత్.. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై విజయఢంకా
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక మహిళల బ్యాడ్మింటన్ టోర్నీ ఉబెర్ కప్‌లో భారత జట్టు పుంజుకుంది. తొలి గ్రూపు మ్యాచ్‌లో డెన్మార్క్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లో ఉక్రెయిన్‌పై విజయం సాధించి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధును సింగిల్స్ గేముకు విశ్రాంతినిచ్చి భారత్ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కానీ, యువ క్రీడాకారిణులు ఆ చాన్స్ అందిపుచ్చుకుని సత్తాచాటారు. మొదటి గేములో ఉన్నతి హుడా 21-19, 22-20 తేడాతో పోలినా బుహ్రోవాను ఓడించి తొలి విజయాన్ని అందించింది. ఇక, రెండో గేములో కాంటెమిర్‌తో హోరాహోరీగా తలపడిన తన్వి 21-12, 17-21, 21-10 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. మూడో సింగిల్స్ గేములో దేవిక సిహాగ్ నెగ్గడంతో భారత్ గెలుపు లాంఛనమైంది. అయితే, డబుల్స్ గేములో భారత జోడీ కవిప్రియ సెల్వమ్-సిమ్రాన్ సింఘి ఓడిపోగా.. చివరి డబుల్స్ గేములో తనీషా క్రాస్టో-పీవీ సింధు నెగ్గడంతో చివరికి భారత్ 4-1తో విజయం సాధించింది. ఈ విక్టరీతో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. చివరి గ్రూపు మ్యాచ్‌లో బలమైన చైనాతో తలపడనుంది. క్వార్టర్స్‌కు చేరుకోవాలంటే ఆ గేములో భారత్ గెలవడం తప్పనిసరి.

Next Story