బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. అందుకోసం 35 మంది ప్లేయర్లను సిద్ధం చేస్తున్న బోర్డు

by Harish |   (  Updated:2026-04-20 13:40:29  IST  )

బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. అందుకోసం 35 మంది ప్లేయర్లను సిద్ధం చేస్తున్న బోర్డు
X

దిశ, స్పోర్ట్స్ : కొంతకాలంగా భారత జట్టు మూడు ఫార్మాట్లలో దాదాపు వేర్వేరు టీమ్‌లతో ఆడుతున్న విషయం తెలిసిందే. భారత జట్టులో చోటు కోసం విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ అందరికీ అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఐపీఎల్ వల్ల జాతీయ జట్టులో చోటు కోసం చూస్తున్న ప్లేయర్ల సంఖ్య ఏడాది ఏడాదికి పెరుగుతోంది. ఈ సీజన్‌లోనూ కొందరు యువ క్రికెటర్లు సత్తాచాటుతున్నారు. దీంతో ఎంపిక ప్రక్రియ సెలెక్టర్లకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకే సమయంలో రెండు టీ20 జట్లను సిద్ధం చేయాలని భావిస్తున్నట్టు బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

30-35 మందితో బోర్డు ఓ జాబితాను సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో నుంచి రెండు జట్లను సిద్ధం చేయాలని భావిస్తున్నది. ఈ ఏడాదే రెండు భారత టీ20 జట్లు ఒకే సమయంలో ఆడే అవకాశం ఉంది. జపాన్‌‌లో ఆసియా గేమ్స్, వెస్టిండీస్‌‌తో టీ20 సిరీస్‌కు మధ్య పెద్దగా గ్యాప్ లేదు. ఆసియా గేమ్స్ కూడా టీ20 ఫార్మాట్‌లోనే జరగనుంది. కాబట్టి, ఒకే టైంలో రెండు భారత జట్ల మ్యాచ్‌కు ఈ రెండు టోర్నీలు వేదిక అవ్వొచ్చు. రెండు టీ20 జట్లలో ఒకదానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని కూడా సదరు వర్గాలు తెలిపాయి. ‘ఆసియా క్రీడలు, భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్ ఒకే సమయంలో జరగబోతున్నాయి. కాబట్టి, మనం రెండు టీ20 జట్లు ఆడటాన్ని చూడొచ్చు. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌లకు 30-35 మంది ప్లేయర్లను సిద్దంగా ఉంచడటం ముఖ్యం. ఇంగ్లాండ్ టూరు, ఐర్లాండ్ టూరుతోపాటు ఆసియా గేమ్స్‌కు కూడా జట్టులో ఎక్కువ ప్లేయర్లు ఉంటారు.’అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.


Next Story