హైదరాబాద్ హ్యాట్రిక్ .. సిక్కింపై ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో విజయం

by Harish |   (  Updated:2024-01-20 19:20:14  IST  )

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు జోరు మీద ఉన్నది. వరుసగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.

హైదరాబాద్ హ్యాట్రిక్ .. సిక్కింపై ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు జోరు మీద ఉన్నది. వరుసగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్లేట్ గ్రూపు మ్యాచ్‌లో శనివారం సిక్కింపై ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 381/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 463/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. ఓవర్‌నైట్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(103 నాటౌట్) సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. టోర్నీలో అతనికి వరుసగా రెండో శతకం. ధాటిగా ఆడిన చందన్ సహాని(54) హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కాసేపటికే వికెట్ పారేసుకున్నాడు. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో సిక్కిం 79 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌కు 384 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ సిక్కిం తేలిపోయింది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఆ జట్టు 186 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. అంకుర్ మాలిక్(34), సుమిత్ సింగ్(34) టాప్ స్కోరర్లు. సిక్కిం బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో 48.3 ఓవర్లలోనే ఆ జట్టు ఆట ముగిసింది. దీంతో రెండు రోజుల్లోనే హైదరాబాద్ విజయం లాంఛనమైంది. హైదరాబాద్ ఈ నెల 26 నుంచి 29 వరకు జరిగే నాలుగో గ్రూపు మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో తలపడనుంది.

Next Story