అందుకే టీమిండియా కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఎట్టకేలకు మౌనం వీడిన కోహ్లీ

by Harish |

అందుకే టీమిండియా కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఎట్టకేలకు మౌనం వీడిన కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టులో కీలక ప్లేయర్‌గా ఉంటూనే కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించడం వల్ల చాలా అలసిపోయానని, అందుకే టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. 2022‌లో విరాట్ భారత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాను ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాన్ని కోహ్లీ తాజాగా వివరించాడు. నాయకత్వ బాధ్యతలు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని వెల్లడించాడు. ‘మా బ్యాటింగ్ యూనిట్‌లో, నాయకత్వ విషయంలో నేను కేంద్ర బిందువుగా మారాను. అప్పుడు భారత క్రికెట్‌ను అగ్రస్థానంలో ఉంచాలనే తపనలో మునిగిపోయాను. దీంతో బ్యాటింగ్ చేయడం, కెప్టెన్సీ బాధ్యతలు నా వ్యక్తిగత జీవితంపై ఎతత భారాన్ని మోపుతాయో అనే విషయాన్ని గ్రహించలేకపోయా. అందుకే నేను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా. ఆ సమయానికి నేను ఎంతో అలసిపోయా. ఫామ్ ఎక్కువ కాలం ఉండదు. అప్పుడు బ్యాటింగ్ చేయడం, నాయకత్వ బాధ్యతలు భారంగా అనిపిస్తాయి. కష్టంగా ఉండేది.’అని కోహ్లీ వివరించాడు. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత తాను బాధకరమైన దశను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోడ్ మద్దతుగా నిలిచారని తెలిపాడు. ‘నేను కెప్టెన్సీ వదిలేసిన తర్వాత రాహుల్ భాయ్, విక్రమ్ రాథోడ్‌లతో మనసు విప్పి మాట్లాడాను. 2023‌లో టెస్టు క్రికెట్‌లో నా ప్రస్థానం అద్భుతంగా సాగింది. నేను వారిని కలిసినప్పుడుల్లా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతాను. వారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను ఏం సాధించానో నాకు అర్థమయ్యేలా చెప్పారు. వారి కోసమైనా ఆడాలనిపించింది.’అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లీకి అద్బుతమైన రికార్డు ఉంది. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు సాధించింది.


Next Story