- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లండ్ లక్ష్యం 371.. రాణించిన రాహుల్,పంత్.. బుమ్రా గెలిపిస్తాడా..?
హెడింగ్లే టెస్టులో ఇంగ్లండ్ ముందు 371 పరుగల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. మరి చివరి రోజు బుమ్రా మ్యాజిక్‌తో గెలిపిస్తాడా?

దిశ, స్పోర్ట్స్: హెడింగ్లే టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత కూడా ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేని విధంగా ఉంది. సోమవారం నాడు టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) అదరగొట్టారు. అయితే వీళ్లు అవుటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఇంగ్లండ్ ముందు 400 పరుగులపైగా టార్గెట్ ఉంచాలనుకున్న టీమిండియా ప్లాన్ ఫెయిలైంది. భారత జట్టు 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ముందు 371 పరుగుల టార్గెట్ ఉంచింది. 2022లో బర్మింగ్‌హాం వేదికగా జరిగిన మ్యాచులో 378 పరుగల టార్గెట్‌ను ఇంగ్లండ్ ఛేజ్ చేసింది. అలాంటి జట్టు ముందు ఈ 371 పరుగుల టార్గెట్ సరిపోతుందా? అనేదే సగటు భారత అభిమాని మనసును తొలిచేస్తున్న ప్రశ్న.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో కూడా భారత లోయర్ ఆర్డర్ నిరాశ పరిచింది. 90/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆరంభించిన భారత్‌కు కాసేపటికే షాక్ తగిలింది. బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి సెషన్‌లో పిచ్ నుంచి సహకారం లభించడంతో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగారు. ఇలాంటి సమయంలో చాలా ఆచితూచి ఆడిన కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118).. లంచ్ తర్వాత వేగం పెంచారు. ఇద్దరూ సెంచరీలు చేసుకున్న తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఎన్నో అంచనాలతో జట్టులో పునరాగమనం చేసి, తొలి ఇన్నింగ్సులో డకౌట్ అయిన కరుణ్ నాయర్ (20) మరోసారి నిరాశపరిచాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రవీంద్ర జడేజా (25 నాటౌట్)కు సహకారం అందించడంలో శార్దూల్ ఠాకూర్ (4), సిరాజ్ (0), బుమ్రా (0), ప్రసిద్ధ్ కృష్ణ (0) విఫలమయ్యారు. ఒకే ఓవర్లో నాయర్, సిరాజ్, బుమ్రాలను అవుట్ చేసిన జోష్ టంగ్.. ఇంగ్లండ్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే షోయబ్ బషీర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన ప్రసిద్ధ్ కూడా టంగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత జట్టు రెండో ఇన్నింగ్సులో 364 పరుగులకు ఆలౌట్ అయ్యి.. ఇంగ్లండ్ ముందు 371 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్సే, టంగ్ చెరో మూడు వికెట్లతో మెరిశారు. బషీర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. స్టోక్స్, వోక్స్ చెరో వికెట్ తీసుకున్నారు.
భారత్ గెలవాలంటే..
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 6 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 21 పరుగులు చేసింది. బుమ్రా వేసిన మూడు ఓవర్లను బెన్ డకెట్ (9 బ్యాటింగ్), జాక్ క్రాలీ (12 బ్యాటింగ్) ఆచితూచి ఆడారు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఆట ముగించారు. ఇక ఐదో రోజున 350 పరుగులు చేస్తే ఆ జట్టు ఈ మ్యాచ్ గెలుస్తుంది. బాజ్‌బాల్ పుణ్యమా అని ఇంగ్లండ్ ముందు ఎలాంటి లక్ష్యమూ సేఫ్ కాకుండా పోయింది. ఇలాంటి సమయంలో భారత్ గెలవాలంటే బుమ్రాకు ప్రసిద్ధ్, సిరాజ్ నుంచి సహకారం లభించడం కీలకం. అదే సమయంలో శార్దూల్ వంటి వికెట్ టేకర్‌ను గిల్ ఎలా వాడుకుంటాడనేది కూడా ముఖ్యమే. బుమ్రా ఒక్కడి మీదనే ఆధారపడి మ్యాచ్ గెలవాలనుకోవడం టీమిండియాకు మంచిది కాదు. అతనికి మిగతా బౌలర్లతోపాటు ఫీల్డర్ల నుంచి కూడా సహకారం అవసరం. తొలి ఇన్నింగ్సులో పేలవ ఫీల్డింగ్‌తో ఇంగ్లండ్‌కు కనీసం 100-150 పరుగులు చేసే అవకాశం ఇచ్చింది టీమిండియా. ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా కట్టడి చేయగలిగితే ఈ మ్యాచ్‌లో గిల్ సేన గెలవడం ఖాయం.






