T20 World Cup: బోణీ కొట్టిన స్కాట్లాండ్.. ఇటలీపై ఘన విజయం

by Kema Shiva Kumar |

ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన గ్రూప్-సీ మ్యాచ్‌లో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో ఇటలీపై భారీ విజయం సాధించింది.

T20 World Cup: బోణీ కొట్టిన స్కాట్లాండ్.. ఇటలీపై ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2026 (ICC T20 World Cup 2026)లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ (Eden Gardens)లో జరిగిన గ్రూప్-సీ మ్యాచ్‌లో స్కాట్లాండ్ (Scotland) 73 పరుగుల తేడాతో ఇటలీ (Italy)పై భారీ విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మైకేల్ లీస్క్ నిలిచాడు. అతడు బ్యాట్‌తో 22 పరుగులు చేసిన బౌలింగ్‌లోనూ అదరగొట్టి 4 వికెట్లు తీసుకున్నాడు. అంతకు మందుకు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. జార్జ్ మున్సే: 84 పరుగులు (54 బంతుల్లో, 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. మైకేల్ జోన్స్ 37 పరుగులతో మున్సేకు మంచి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన బ్రాండన్ మెక్‌ముల్లెన్ కేవలం 18 బంతుల్లోనే 41 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మైకేల్ లీస్క్ రెచ్చిపోయి కేవలం 5 బంతుల్లోనే 22 పరుగులు సాధించి జట్టు స్కోరును 200 దాటించాడు.

లక్ష్య ఛేదనలో ఇటలీ చతికిల..

టీ20 ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇటలీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ వేన్ మాడ్సెన్ (Wayne Madsen) ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ 16.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో బెన్ మనెంటి ఒక్కడే 52 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి హ్యారీ మనెంటి 37 పరుగులు చేసి అండగా నిలిచాడు. వీరిద్దరి మధ్య 73 పరుగుల భాగస్వామ్యం నెలకొన్నా, మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో ఇటలీకి ఓటమి తప్పలేదు. స్కాట్లాండ్ బౌలర్లలో మైకేల్ లీస్క్ 4 వికెట్లతో చెలరేగగా, మార్క్ వాట్ 2 వికెట్లు పడగొట్టాడు.

Next Story