ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నడిపించేది అతడే.. ఆస్ట్రేలియా క్రికెటర్‌పై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

by Dishanational3 |
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నడిపించేది అతడే.. ఆస్ట్రేలియా క్రికెటర్‌పై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్)కు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తాడని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. కమిన్స్‌ను కెప్టెన్‌ చేయడం హైదరాబాద్‌కు గేమ్ చేంజర్ అవుతుందని చెప్పాడు. అంతేకాకుండా, కమిన్స్ బహుముఖ ప్రజ్ఞశాలి అని, అతని నాయకత్వం కూడా జట్టు విజయానికి చాలా అవసరమని తెలిపాడు. ‘కమిన్స్‌‌ను కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయమని భావిస్తున్నా. అతనికి కాస్త ఎక్కువ ధరే వెచ్చించారు. కమిన్స్ హైదరాబాద్‌కు నాయకత్వ కోణాన్ని తీసుకొస్తాడు. గత సీజన్‌లో అది కనిపించలేదు. కీలక మ్యాచ్‌ల్లో బౌలింగ్‌లో మార్పులు చేయడం ఎస్‌ఆర్‌హెచ్‌ను నష్టపరిచింది. ఇప్పుడు కమిన్స్ జట్టులో ఉన్నాడు. అతను కెప్టెన్ అవుతాడని కచ్చితంగా చెప్పగలను. ఆ నిర్ణయం భారీ మార్పును తెస్తుంది.’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్ నాయకత్వంలో 2016లో తొలిసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ జట్టు మరోసారి టైటిల్ ముద్దాడలేకపోయింది. వార్నర్‌ను తప్పించి కేన్ విలియమ్సన్‌కు.. ఆ తర్వాత గత సీజన్‌లో మార్క్‌రమ్‌కు పగ్గాలు అప్పగించినా జట్టు వైఫల్యం కొనసాగింది. గత సీజన్‌లో పాయింట్స్ టేబుల్‌లో అట్టడగున నిలిచింది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ప్యాట్ కమిన్స్ కోసం భారీ ధర వెచ్చింది. అతన్ని ఏకంగా రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కెప్టెన్సీ్‌లో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌తోపాటు గతేడాది వన్డే వరల్డ్ కప్‌ విజేతగా నిలిచింది. సారథిగానే కాకుండా బంతితోపాటు బ్యాటుతోనూ సత్తాచాటే సామర్థ్యం అతనికి ఉంది. ఈ నేపథ్యంలో అతనికి భారీ ధర వెచ్చించేందుకు హైదరాబాద్ వెనుకాడలేదని తెలుస్తోంది. మరో ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రేవిస్ హెడ్‌ను రూ.6.80 కోట్లకు, శ్రీలంక స్టార్ స్పిన్నర్ హసరంగను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.



Next Story

Most Viewed