చిక్కడు..దొరకడు.. ప్రచారంలో వెనుకంజ.. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిపై విమర్శలు

by Disha Web Desk 23 |
చిక్కడు..దొరకడు.. ప్రచారంలో వెనుకంజ.. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిపై విమర్శలు
X

దిశ,మేడ్చల్ బ్యూరో : డాక్టర్ వంశ తిలక్... కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి.ఉప ఎన్నిక ప్రకటన వెలువడగానే పారాచూట్ పై నుంచి రంగంలోకి దిగాడు.ఎమ్మెల్యే టికెట్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారు. తన తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలతో పాటు మాదిగ సామాజిక వర్గాన్ని సైతం వాడుకున్నారు.టికెట్ సాధించిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని గాలికి వదిలేశారు. నియోజకవర్గ ఓటర్లనే కాదు.. కనీసం బీజేపీ కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. రోజులో కొన్ని గంటల పాటు అజ్ఠాతంలోకి వెళ్లిపోతుంటారని పార్టీ శ్రేణులే ఫైర్ అవుతున్నారు.

తల్లిదండ్రుల వారసుడిగా..

మాజీ డిప్యూటీ స్పీకర్ టీ.ఎన్.సదాలక్ష్మి, పద్మ శ్రీ అవార్డు గ్రహీత టీవీ నారాయణ దంపతుల కుమారుడే ఈ వంశ తిలక్. వైద్య వృత్తిని అభ్యసించి, డాక్టర్ గా సేవలందించారు .అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.లాస్య నందిత ఫిబ్రవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.కాగా లాస్య నందిత చేతిలో ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ కి కాంగ్రెస్ పార్టీ గాలమేసింది. ఈ నేపథ్యంలో బీజేపీకి అభ్యర్థి లేకుండా పోయారు.దీంతో డాక్టర్ టీ.ఎన్.వంశ తిలక్ కు ఎమ్మెల్యే కావాలని ఆశ పుట్టింది. తనది బొల్లారం ప్రాంతమే కనుక స్థానికుడినని బీజేపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. టికెట్ వచ్చేంత వరకు కంటోన్మెంట్ లో హడావిడి చేశారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాలలకు టికెట్ కేటాయించినందున మాదిగలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది. మాదిగ సామాజిక వర్గానికే చెందిన వంశ తిలక్ కు ఈ అంశం కలిసొచ్చింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగ,ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి నాయకత్వం సపోర్ట్ చేసింది. దీంతో వంశ తిలక్ నే టికెట్ వరించింది.

చిక్కడు.. దొరకడు..

టికెట్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాల్సిన వంశ తిలక్ పట్టనట్లు వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు కావాల్సిన వ్యూహం లేకుండా .. కేవలం ఎవరైనా అరెంజ్ చేసిన కార్యక్రమానికి హడావిడిగా హాజరై వెళ్లుతున్నాడని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు ప్రచార పర్వం లో దూసుకుపోతుంటే బీజేపీ అభ్యర్థి మాత్రం ఎన్నికల వాతావరణాన్నే కల్పించడం లేదని కాషాయ పార్టీ లీడర్లు గుస్సాతో ఉన్నారు. పార్టీ నాయకులను కలుపుకొని పోవడం లేదని, ఎవరికి ఎన్నికల బాధ్యతలు అప్పగించడంలేదంటున్నారు. ఎన్నికల వ్యూహంపై ఇటివల జరిగిన పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ వంశ తిలక్ తీరుపై పార్టీ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.పద్ధతి మార్చుకోవాలని పార్టీ నాయకత్వం సైతం హెచ్చరించినట్లు సమాచారం. అయినా వంశ తిలక్ వ్యవహార శైలిలో మార్పు రావడం లేదని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో వంశ తిలక్ వెంట నడిచిన మాదిగ సామాజిక వర్గ కీలక నేతలు సైతం ఆయన తీరుతో విసిగి పోయి తలో దారి చూసుకుంటున్నట్లు తెలిసింది. టికెట్ కోసం ప్రయత్నించినప్పటి ఉత్సహం.. టికెట్ దక్కిన తర్వాత చూపించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Next Story

Most Viewed