IPL 2025 : డీజేలుండవ్.. చీర్ గర్ల్స్ కనిపించరు.. ఎందుకంటే?

by Naga Rani Yarlagadda |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో మిగిలిన 17 మ్యాచ్‌లను డీజేలు, చీర్‌లీడర్స్, లౌడ్ మ్యూజిక్ లేకుండా నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) నిర్ణయించింది.

IPL 2025 : డీజేలుండవ్.. చీర్ గర్ల్స్ కనిపించరు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో మిగిలిన 17 మ్యాచ్‌లను డీజేలు, చీర్‌లీడర్స్, లౌడ్ మ్యూజిక్ లేకుండా నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) నిర్ణయించింది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) కారణంగా ఐపీఎల్ ఒక వారం పాటు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల గౌరవార్థం, ఐపీఎల్‌లో గ్లామర్, వినోద అంశాలను తగ్గించాలని గవాస్కర్ బీసీసీఐని కోరారు.

"డీజేలు, చీర్‌లీడర్స్, లౌడ్ మ్యూజిక్ లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తే, దేశంలోని సున్నితమైన పరిస్థితుల పట్ల గౌరవం చూపినట్లు ఉంటుంది." అని గవాస్కర్ చెప్పారు. ఈ సూచనను బీసీసీఐ సీరియస్‌గా పరిగణించి.. మే 17 నుంచి తిరిగి ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లలో ఈ మార్పులను అమలు చేయాలని నిర్ణయించింది.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి డీజేలు, చీర్‌లీడర్స్ లీగ్‌లో అంతర్భాగంగా ఉంటూ వచ్చాయి. అయితే.. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ అంశాలను తాత్కాలికంగా తొలగించాలని బీసీసీఐ భావిస్తోంది. "ఇది కేవలం క్రికెట్‌పై దృష్టి పెట్టే అవకాశం. ఆటను ఆస్వాదించడానికి గ్లామర్ అవసరం లేదు." అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ చర్యను గౌరవప్రదంగా భావిస్తుండగా.. మరికొందరు ఐపీఎల్‌లోని వినోద విలువ తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే 17వ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Next Story