ఎస్‌ఆర్‌హెచ్ నుంచి స్టార్ బౌలర్ ఔట్.. అతన్ని లక్నోకు ఇచ్చేందుకు ఒప్పందం?

by Harish |

సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఎస్‌ఆర్‌హెచ్ నుంచి స్టార్ బౌలర్ ఔట్.. అతన్ని లక్నోకు ఇచ్చేందుకు ఒప్పందం?
X

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్-2026కు బౌలర్ మహ్మద్ షమీని అంటిపెట్టుకోవడానికి సిద్ధంగా లేదని సమాచారం. ఎస్‌ఆర్‌హెచ్ షమీని లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల మధ్య క్యాష్ ట్రేడ్ ఒప్పందం జరిగినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో షమీని హైదరాబాద్ రూ.10 కోట్లకు దక్కించుకుంది. అంతే ధరకు ఇప్పుడు లక్నో అతన్ని తీసుకుంటుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఏడాది షమీ పెద్దగా ఆకట్టుకోలేదు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 6 వికెట్లే తీశాడు. పరుగులు కూడా ధారాళంగా ఇచ్చాడు. కొంతకాలంగా షమీ గాయాలతో సతమతమవడం కూడా హైదరాబాద్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

మరోవైపు, అనుభవజ్ఞుడైన బౌలర్ కోసం చూస్తున్న లక్నో షమీపై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. లక్నో ఫ్రాంచైజీ శుక్రవారం ఎక్స్‌ వేదికగా పెట్టిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న లక్నో.. ‘ఏ కారణం లేకుండా ఈ ఏకనా స్టేడియం మూమెంట్ గురించి ఆలోచిస్తున్నా.’అని రాసుకొచ్చింది. ఈ పోస్టుతో షమీని తీసుకున్నట్టు లక్నో హింట్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్-2026 మినీ వేలానికి సంబంధించి ఫ్రాంచైజీలు శనివారం తాము రిలీజ్ చేసే ప్లేయర్ల జాబితాను ప్రకటించనున్నాయి. దీంతో షమీ ట్రేడ్‌పై స్పష్టత రానుంది.


Next Story