- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేత
ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ముందు క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ముందు క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ)పై ఉన్న సస్పెన్షన్‌ను మంగళవారం ఎత్తివేసింది. అంతర్జాతీయ టోర్నీలపై భారత రెజ్లర్ల ఆసక్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పాలనా శూన్యత అథ్లెట్ల శిక్షణపై ప్రభావం చూపుతుందని, రాబోయే ఆసియా గేమ్స్-2026, ఒలింపిక్స్-2028లలో పతకాలపై ఆ ప్రభావం ఉంటుందని తెలిపింది. రెజ్లింగ్ నిర్వహణలో స్థిరత్వం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పింది.
2023 డిసెంబర్ 24న డబ్ల్యూఎఫ్‌ఐపై కేంద్రం సస్పెన్షన్ విధించింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ నిబంధనలను విరుద్ధంగా జాతీయ చాంపియన్‌షిప్ నిర్వహణపై ప్రకటన చేయడం, కొత్త పాలకవర్గం ఎన్నికైనా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ నియంత్రణలోనే సమాఖ్య ఉండటం లాంటి కారణాలతో అప్పుడు చర్యలు చేపట్టింది. ఆ తర్వాత డబ్ల్యూఎఫ్ఐ రోజు వారీ కార్యకలాపాలను భారత ఒలింపిక్ అసోసియేషన్ నియమించిన అడ్ హక్ కమిటీ పర్యవేక్షించింది.
14 నెలల తర్వాత భారత రెజ్లింగ్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని క్రీడా శాఖ తాజాగా ఎత్తివేసింది. దీంతో డబ్ల్యూఎఫ్‌ఐ సంజయ్ సింగ్ నేతృత్వంలోని పాలక వర్గం నియంత్రణలోకి వచ్చింది. దీంతో దేశీయ టోర్నీలు, అంతర్జాతీయ టోర్నీలకు జాతీయ జట్ల ఎంపికకు మార్గం సుగుమమైంది. ఈ నెల 15న ఢిల్లీలో రెజ్లింగ్ ట్రయల్స్ నిర్వహిస్తామని సంజయ్ సింగ్ తెలిపారు. ఈ నెల 25-30 వరకు జోర్డాన్‌లోని అమ్మాన్‌లో జరిగే ఏసియన్ చాంపియన్‌షిప్స్ జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొంటేనే సెప్టెంబర్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలోకి దిగొచ్చు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు సంజయ్ సింగ్ సన్నిహితుడు. 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ గెలుపొందారు. ఆయన ఎన్నికను వ్యతిరేకంగా సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే.






