కేంద్ర బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.3,794 కోట్లు.. కేటాయింపులు తగ్గాయా? పెరిగాయా?

by Harish |

పార్లమెంట్‌లో శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2025-26లో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు రూ.3,794.30 కోట్లు కేటాయించారు.

కేంద్ర బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.3,794 కోట్లు.. కేటాయింపులు తగ్గాయా? పెరిగాయా?
X

దిశ, స్పోర్ట్స్ : పార్లమెంట్‌లో శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2025-26లో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు రూ.3,794.30 కోట్లు కేటాయించారు. గతేడాది పోలిస్తే ఇది రూ. 351. 98 కోట్లు పెంపు. వచ్చే ఏడాది ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి పెద్ద క్రీడా ఈవెంట్‌లు లేనప్పటికీ క్రీడల బడ్జెట్‌ను పెంచడం గమనార్హం. బడ్జెట్‌లో ఖేలో ఇండియా ప్రొగ్రామ్‌కు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మరోసారి పెద్దపీట వేశారు. 2024-25లో రూ.800 కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ.1000 కోట్లకు పెంచారు. గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లు అదనంగా ఇచ్చారు.

అలాగే, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌కు రూ.60 కోట్లు పెంచి రూ. 400 కోట్లు కేటాయింపులు చేశారు. జాతీయ క్యాంప్‌లు, అథ్లెట్ల ట్రైనింగ్ పర్యవేక్షించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)కు బడ్జెట్‌లో గతేడాది పోలిస్తే రూ. 15 కోట్లు అదనంగా లభించాయి. మొత్తం రూ.830 కోట్లు కేటాయించారు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి రూ. 24.30 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు రూ.18 కోట్లు ఇచ్చారు. అయితే, అథ్లెట్ల ఇన్సెంటీవ్స్‌ను రూ. 42.65 కోట్ల నుంచి రూ. 37 కోట్లుకు తగ్గించడం గమనార్హం. ఇక, జమ్ము కశ్మీర్‌లో క్రీడల సౌకర్యాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. బడ్జెట్‌లో గతేడాది పోలిస్తే 14 కోట్లు పెంచి రూ. 20 కోట్లు కేటాయించింది. మరోవైపు, నేషనల్ సర్వీస్‌ స్కీంకు ఈ సారి బడ్జెట్‌లో రూ.450 కోట్లు దక్కాయి. గతేడాది పోలిస్తే రూ. 200 కోట్లు అదనంగా కేటాయింపులు జరిగాయి.


Next Story