150 పరుగుల తేడాతో చిత్తు.. వరల్డ్ కప్‌ సెమీస్ రేసు నుంచి పాక్ మహిళలు అవుట్

by Phanindra |

వరల్డ్ కప్‌ సెమీస్ రేసు నుంచి పాక్ మహిళలు అవుట్. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఏకంగా 150 పరుగుల తేడాతో చిత్తయిందా టీం.

150 పరుగుల తేడాతో చిత్తు.. వరల్డ్ కప్‌ సెమీస్ రేసు నుంచి పాక్ మహిళలు అవుట్
X

దిశ, స్పోర్ట్స్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అమ్మాయిలు అదరగొట్టారు. చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్‌లో వరుసగా ఐదు విజయాలు సాధించారు. కొలంబో వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏకంగా 150 పరుగుల తేడాతో చిత్తుచేశారు. వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత సౌతాఫ్రికా మహిళలే బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ లారా వోల్వార్ట్ (90), సూన్ లూస్ (61), మారిజానే కాప్ (68), నడైనా డి క్లర్క్ (41) రాణించడంతో నిర్ణీత 40 ఓవర్లలో సౌతాఫ్రికా అమ్మాయిలు 312/9 పరుగుల భారీ స్కోరు చేశారు. ఛేజింగ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో పాక్ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234 పరుగులుగా సవరించారు. అయితే ఈ లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ పాక్ మహిళలు పోటీ ఇవ్వలేకపోయారు.

క్రీజులో నిలబడేందుకే ఇబ్బంది పడినట్లు కనిపించిన వాళ్లు. ఒకవేళ కుదురుకున్నా జిడ్డు బ్యాటింగ్‌తో నిరాశపరిచారు. సిద్రా నవాజ్ (22), నటాలియా పర్వేజ్ (20), సిద్రా అమీన్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగతా వాళ్లు దారుణంగా నిరాశపరిచారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 83 పరుగులే చేయగలిగింది. సఫారీ బౌలర్లలో మారిజానే కాప్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. నొండుమిసో షంగాసే రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కాప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరుకోగా.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి పాక్ తప్పుకుంది.

సంక్షిప్త స్కోరు బోర్డు

సౌతాఫ్రికా: 312/9 (40 ఓవర్లలో)

లారా వోల్వార్ట్ (90), సూన్ లూస్ (61), మారిజానే కాప్ (68 నాటౌట్), నడైన్ డి క్లర్క్ (41)

ఎక్స్‌ట్రాలు: 22

బౌలింగ్: సదియా ఇక్బాల్ (3/63), నష్రా సంధూ (3/45)

పాకిస్తాన్: 83/7 (20 ఓవర్లలో)

నటాలియా పర్వయిజ్ (20), సిద్రా నవాజ్ (22 నాటౌట్)

ఎక్స్‌ట్రాలు: 9

బౌలింగ్: మారిజానే కాప్ (3/20), షంగాసే (2/19)

Next Story